రఘునాథపాలెం, మే 24 : పేదలు గుడిసెలు వేసుకుంటేనే బుల్డోజర్లు పెట్టి మరీ కూల్చివేయించిన రేవంత్ సర్కార్‌కు తమ పార్టీ నాయకుడు ఎన్నెస్పీ స్థలంలో అక్రమంగా కట్టిన ఇల్లు మాత్రం కనిపించడం లేదు. ఖమ్మం నగర పరిధిలో విలువైన ఎన్నెస్పీ స్థలం ఆక్రమణకు గురైనా రెవెన్యూ, ఎన్నెస్పీ అధికారులు కనీసం కన్నెత్తి చూసింది లేదు. అధికారుల పట్టింపులేనితనాన్ని అవకాశంగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీ నేత ఏకంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఆ ఇంటికి తప్పుడు పత్రాలు సృష్టించి, దొడ్డిదారిన ఇంటి నంబర్ తెచ్చుకొని హక్కులను కూడా పొందాడు. ‘ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకున్నాం.. ఇంటి నంబరు కేటాయించండి సార్ అని కార్పొరేషన్ అధికారులను అశ్రయిస్తే.. పట్టా సర్టిఫికెట్ ప్రభుత్వం ఇచ్చిందేనా..?
రెవెన్యూ ఆఫీస్ నుంచి జన్యునిటీ సర్టిఫికెట్ తెచ్చుకో..’ అంటూ పలు ప్రశ్నలు సంధించి పని చేయకుండానే పంపించేస్తారు.. కానీ ఓ కాంగ్రెస్ నేత ఎన్నెస్పీ స్థలాన్ని ఆక్రమించి కట్టుకున్న ఇంటికి మాత్రం ఏ కారణాలు అడుగకుండా ఇంటి నంబరు కేటాయించి సర్వహక్కులు కల్పించేశారు. పైగా ఇంటి నంబర్ కోసం తాను జతపరిచిన పట్టాలోని సర్వే నంబర్.. కట్టిన ఇల్లు ఉన్న ప్రాంతం సర్వే నంబర్ వేర్వేరు అయినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. సాగర్ కాలువకు ఆనుకొని ఇండ్లు కనిపిస్తున్నా, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టకుండానే నంబర్ కేటాయించినట్టు తెలుస్తున్నది. సదరు నేత ఇక్కడితోనే ఆగకుండా ఇంటి ఎదుట రోడ్డు భాగాన్ని ఆక్రమిస్తూ భారీ షెడ్డు నిర్మాణాన్ని చేపట్టాడు. అంటే కబ్జా బాగోతం ఇంటి నిర్మాణంతోనే ఆగిపోలేదు. అధికార పార్టీ ముసుగులో సదరు నేత ఆక్రమణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని 8వ డివిజన్‌కు చెందిన ఎల్బీనగర్ ప్రాంతవాసులు కలెక్టర్‌ను డిమాండ్ చేస్తున్నారు.