హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించేందుకు తెచ్చిన బృహత్తర పథకం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ. కోట్లమంది పేదలు ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నారు. వారిలో అత్యధికులు బీసీ, ఎస్సీ, ఎస్టీలే. ఇంతటి ముఖ్యమైన పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాగైనా ధ్వంసం చేయాలని కంకణం కట్టుకొన్నట్టు తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతున్నది. ఈ పథకంలో గతంలో లేని విధంగా కులాలవారీగా కూలి ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించటంతో గతేడాది దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొంటున్నట్టు ప్రకటించినా, ఇప్పటికీ అదే విధానంలో కూలి చెల్లిస్తున్నది. అది కూడా సమయానికి ఇవ్వకుండా ఎస్సీ, ఎస్టీల కడుపు మాడుస్తున్నది.
న్లైనా కూలి రాలే
ఉపాధి హామీ చట్టం ప్రకారం మస్టర్ రోల్ మూసివేసిన తేదీ నుంచి 15 రోజుల్లో కార్మికులకు కూలి మొత్తాన్ని చెల్లించాలి. ఆ లోపు చెల్లించకుంటే మస్టర్ రోల్ మూసివేసిన 16వ రోజు నుంచి ప్రతిరోజూ వేతన బకాయిపై 0.05 శాతం చొప్పున ఆలస్యపు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇది ఎక్కడా అమలు కావడంలేదు. తెలంగాణలో ఎస్సీలకు గతేడాది డిసెంబర్లో చేసిన పనికి ఇంతవరకు కేంద్రం కూలి చెల్లించలేదు. ఎస్టీలకు గత జనవరి మొదటి వారం తరువాత కూలి ఇవ్వలేదు. దీంతో కూలీలు ఆకలితో అలమటిస్తున్నారు. ఉపాధి హామీ కూలి చెల్లింపు ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో కార్మికులు తమ పని పూర్తి చేసుకున్న తరువాత మండల స్థాయిలో ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ (ఎఫ్‌టీవో) జనరేట్ చేసి కేంద్రానికి డిజిటల్ రూపంలో పంపిస్తారు. రెండో దశలో ఎఫ్టీవోలను కేంద్రం ప్రాసెస్ చేసి వేతనాలను నేరుగా కూలీల ఖాతాలకు బదిలీ చేయాలి. మొదటి దశ బాధ్యత రాష్ట్రానిది. రెండో దశ పూర్తిగా కేంద్రానిదే. మొదటి దశను 8 రోజుల్లో పూర్తి చేయాలి. రెండో దశను 7 రోజుల్లో పూర్తి చేయాలి. మొత్తంగా 15 రోజుల్లో కూలీలకు కూలి అందాలి. మొదటి దశ సకాలంలో పూర్తి అవుతున్నప్పటికీ రెండో దశలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. కేంద్రం కూలీలకు కూలి చెల్లించడానికి నెల రోజులకు పైగా సమయం తీసుకొంటున్నది. లిబ్ టెక్ ఇండియా సంస్థ 1.97 లక్షల లావాదేవీలను పరిశీలించగా, వారికి కూలి చెల్లించడానికి కనీసం 30 రోజులకు పైగా పట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వారంరోజుల్లో 72 శాతం, 2020-21లో 66 శాతం, 2021-22లో 16.8 శాతం మాత్రమే చెల్లింపులు చేశారు.
ఉపాధి మన దగ్గరే అత్యధికం