హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు అందడంలేదు. తీవ్ర పనిభారం మోపుతున్న ప్రభుత్వం.. చేసిన పనికి సక్రమంగా వేతనాలు ఇవ్వడానికి కుంటిసాకులు చెప్తున్నదని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ కింద 12,520 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరితోపాటు ఎస్ఎస్ఏఏటీలో 200 మంది పనిచేస్తున్నారు.
‘ఇకపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేసే 92 వేల మంది ఉద్యోగులకు గ్రీన్‌చానెల్ ద్వారా రూ.115 కోట్లు చెల్లిస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వీరికి కూడా ఒకటో తేదీనే అకౌంట్లలో వేతనాలు జమచేస్తాం’ అని మంత్రి సీతక్క గతంలో హామీ ఇచ్చారు. నేటికీ హామీ అమలుకావడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బొలుగురి రవి ఆవేదన వ్యక్తంచేశారు.
ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న టెక్నికల్ టీఏలకు అక్టోబర్ నుంచి వేతనాలు రావడం లేదు. గ్రామీణ స్థాయిలో ఉపాధి పనులను పర్యవేక్షించే ఎఫ్‌ఏలకు ఆగస్టు నుంచి జీతాలు అందడంలేదు. కంప్యూటర్ ఆపరేటర్లకు, కన్సల్టెంట్ ఇంజినీర్లకు మూడు నెలలుగా, అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ (ఏపీవో)లకు రెండు నెలలుగా వేతనాలు రావడం లేదు. ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్‌గా గుర్తిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారని, కానీ, నేటికీ అమలుచేయడం లేదని ఉపాధి ఉద్యోగ సంఘం నేతలు వాపోతున్నారు. వచ్చే కొద్దిపాటి వేతనం కూడా నెలల తరబడి ఇవ్వకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయని సిబ్బంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఆగస్టు నుంచి వేతనాలు రావడం లేదు. వచ్చేది కొద్ది మొత్తం రూ.10,400. అది కూడా రెగ్యులర్‌గా వస్తలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు నెలనెలా వేతనాలు వచ్చేది. మూడు నెలలు, నాలుగు నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తే కుటుంబాలు ఎలా బతకాలి. పిల్లల స్కూళ్ల ఫీజులు ఎలా కట్టాలి. రోగమొస్తే ఎలా వైద్యం చేయించుకోవాలి? కూరగాయలకు కూడా డబ్బులు ఉండటం లేదు. చేతిలో చిల్లిగవ్వలేక ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్లడం లేదు. ఫోన్ రీచార్జ్, బండిలో పెట్రోల్‌కు కూడా డబ్బులు లేవు. క్షేత్రస్థాయిలో పనులను ఎలా పరిశీలించాలి. తక్షణమే ప్రభుత్వం స్పందించి మా పెండింగ్ వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నా.
-తాటిపాముల లక్ష్మణ్, ఫీల్డ్ అసిస్టెంట్ నల్లగొండ జిల్లా