సిటీబ్యూరో : ఉద్యోగులు కదం తొక్కారు.. తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నినదిస్తూ.. నగరంలోని పలు చోట్ల వివిధ రూపాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళాన్ని వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేశారు. ఓపీఎస్‌ను పునరుద్ధరించాలంటూ.. ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నాన్‌టీచింగ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో సిబ్బంది నిరసన తెలిపారు. ఉస్మానియా దవాఖానలోనూ ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ.. బీఎంఎస్ యూనియన్ ఓజీహెచ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, బిల్లులు చెల్లించాలని పీవీ నర్సింహారావు వెటర్నరీ ఉద్యోగులు మహాధర్నాకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ఎనర్జీ సెక్రటరీ నవీన్‌మిట్టల్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆబ్కారీ భవన్లో ఉద్యోగులు పెండింగ్ డీఏ, పీఆర్సీ అమలు చేయాలంటూ.. ఆందోళన బాట పట్టారు. సీఐలు, ఎస్ఐ స్థాయి అధికారులూ నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగడం గమనార్హం.
సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగ సంఘాల జేఏసీలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు చెందిన అధికారులు,సిబ్బంది నిరసన బాట పట్టారు. గురువారం ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన మహా ధర్నాకు మద్దతుగా ఆబ్కారీ భవన్ నుంచి నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు, నల్ల చొక్కాలు ధరించి విధులకు హాజరయ్యారు. 6 డీఏలను తక్షణమే విడుదల చేయాలని, 2వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, 12.5శాతం కోటా అమలు చేయాలన్నారు. సాధారణంగా యూనిఫార్మ్ సర్వీసెస్‌కు చెందిన ఉద్యోగులు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించడం అరుదు. కానీ కాంగ్రెస్ సర్కార్ పరిపాలనా వైఫల్యాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు ఆందోళన పడుతున్నారు. ఆబ్కారీ అధికారులు, సిబ్బంది నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు టి.లక్ష్మణ్‌గౌడ్, కార్యదర్శి చంద్రశేఖర్, తెలంగాణ స్టేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ, టీఎన్జీవోస్ మీడియా ఇన్చార్జి మహేందర్‌రావు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

సుల్తాన్‌బజార్,ఆగస్టు 27: ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని టీఎన్జీవో స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు, హైదరాబాద్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాకు గన్‌ఫౌంఢ్రీలోని డీఈవో కార్యాలయం నుంచి సుమారు 200 మంది ఉద్యోగులు బైక్‌లపై ర్యాలీగా తరలివెళ్లారు. పీఆర్సీ, ఆరు డీఏలు, పెండింగ్ బకా యిలలు ,హెల్త్ కార్డుల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
టీఎన్జీవో నాయకులు రుగేష్, జయంతి రెడ్డి, ఫెరోజ్ అహ్మద్, వై రవి, ప్రియదేవ్ ఠాకూర్, మోయిన్, ముజాహిద్, రమేష్, సుదర్శన్తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 27: ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బీ రవిప్రకాశ్ డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధిలతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ మను చౌదరికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వినోద్, సదానందం గౌడ్, రాజగంగారెడ్డి, వెంకటేశ్వర్లు, ఆనంద్ రెడ్డి, విటల్, మదన్ రెడ్డి, రాజు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, ఆగస్ట్ 27(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు గురువారం ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌ను కలిసి విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై చర్చించారు. ఏప్రిల్ 1 నుంచి అమలు కావలసిన పీఆర్సీ కోసం వెంటనే కమిటీ ఏర్పాటు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసిన విధానాన్ని విద్యుత్ సంస్థల ఉద్యోగులకు కూడా వర్తింపజేసి, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ మార్పు సమస్యను పరిష్కరించాలని కోరారు. పదవీవిరమణ తర్వాత ఉద్యోగులు ఎదుర్కొంటున్న వైద్యసదుపాయాల సమస్యలపై దృష్టిపెట్టాలని, పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లను వెంటనే ఇవ్వాలని నవీన్‌మిట్టల్‌ను కోరారు. నవీన్‌మిట్టల్‌ను కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ సీహెచ్ రమేశ్, కో చైర్మన్ పీ అంజయ్య, కన్వీనర్ ఎన్ శివాజీ, కో కన్వీనర్ నాసర్ షరీఫ్, ఎండీ అక్బర్, కరెంట్ రావు, రాజారవిచంద్ర, కే వెంకటేశ్వర్లు, విజయ్, ప్రవీణ్, తిరుపతయ్య తదితరులు ఉన్నారు.
సుల్తాన్‌బజార్, ఆగస్టు 27: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని బీఎంఎస్ యూనియన్ సలహాదారులు గొల్లపల్లి అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఉస్మానియా దవాఖానాలో బీఎంఎస్ యూనియన్ ఓజీహెచ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ఉస్మానియా దవాఖాన పాత భవనం నుంచి ఓపీ బ్లాక్ వరకు ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు మహేందర్, శ్రీనివాస్, శీరీష, కుమార్, జీపీ క్రిష్ణ, జంగమేశ్వర్, జగన్, మాధవి, మునుస్వామి, ప్రవీణ్, సాయి, రాజేష్, దాస్, వెంకటరమణతో పాటు ఉస్మానియా దవాఖాన సిబ్బంది తదితరులు పాల్గొ న్నారు.

కవాడిగూడ, ఆగస్టు 27: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీష్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు. ఈమేరకు జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఆందోళనలను తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎం హుస్సేనీ(ముజీబ్), టీఎన్జీవోస్ జనరల్ సెక్రెటరీ బీశ్యామ్, జేఏసీ నాయకులు జి.వెంకటే, విక్రమ్, కృష్ణాయాదవ్, కస్తూరి వెంకటేశ్వర్లు, రామారావు, సహదేవ్, సత్యనారాయణగౌడ్, శ్రీరామ్‌రెడ్డి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ యూనివర్సిటీ, ఆగస్టు 27: ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికలపుడు ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఓపీఎస్ పునరుద్ధరించాలని రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నాన్‌టీచింగ్ ఎంప్లాయిస్ ప్రధాన కార్యదర్శి జి.పరమేశ్వర్ డిమాండ్ చేశారు. ఉద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం సిబ్బంది నిరసన తెలిపారు. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్‌లోఉన్న డీఎలు, బిల్లులు వెంటనే చెల్లించాలని పీవీ నర్సింహరావు వెటర్నరీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఓపీఎస్‌ను అమలుచేయాలని నాన్ టీచింగ్ ఉద్యోగులసంఘం అధ్యక్షుడు ఎండీ షర్పద్ధీన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, నాయకులు.. నర్సింహ, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
మల్కాజిగిరి, ఆగస్టు 27: సమస్యల సాధనకై మల్కాజిగిరి జిల్లా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది గురువారం నిరసన తెలియజేశారు. పీఆర్సీ, డీఏ, పెండింగ్ బిల్లులు, ఓపీఎస్, ఎన్ఈహెచ్ఎస్ ఆరోగ్య సేవలు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఆస్పత్రి ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డా.శోభ, డా.మాధురి, డా.సంజీవ్‌నాయక్, డా.వినోద్, రమేష్, వినయ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.