హైదరాబాద్, ఆగస్టు 23, (నమస్తే తెలంగాణ): హక్కుల సాధనే లక్ష్యంగా సర్కార్‌పై ఉద్యోగులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఈనెల 27న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ఆందోళన కార్యక్రమంలో ఉద్యోగులందరూ పాల్గొనాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ విక్రమ్ కుమార్, కన్వీనర్ ఎంబీ కృష్ణ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమ కార్యాచరణను విజయవంతం చేయడం కోసం హైదరాబాద్‌లోని టీఎన్జీవోస్ భవన్లో కమిటీ చైర్మన్ విక్రమ్ కుమార్, కన్వీనర్ ఎంబీ కృష్ణాయాదవ్ నేతృత్వంలో సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో జేఏసీ కో కన్వీనర్లు శ్యామ్ సుందర్, రాంబాబు, ఎన్ నర్సింగ్‌రావు, వీ సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు కూరాడి తదితరులు పాల్గొన్నారు.