హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు పెండింగ్లో లేవని, స్వరాష్ట్రంలో ఎందుకున్నాయని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల సంకల్ప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సకల జనుల సమ్మె చేసి తెలంగాణ తెచ్చుకోవడమే ఉద్యోగుల చేసిన తప్పా అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్కులు అనేకసార్లు ఉద్యోగులతో చర్చలు జరిపారని, చర్చలు తప్ప పరిష్కారం చూపలేదని మండిపడ్డారు. ఈహెచ్ఎస్ ప్రారంభించినా అమలులో అనేక లోపాలున్నాయని విమర్శించారు. రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జేఏసీ సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి ఉద్యోగులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, 2004కు ముందు నియమితులైన వారికి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పీఆర్సీ, పెండింగ్ డీఏల కోసం ఇంకా రెండేండ్లు వేచి చూడాలన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలను టీఎస్ యూటీఎఫ్ ఖండించింది. మూడేండ్ల ఆలస్యానికి కారణాలు చెప్పకుండా మరో రెండేండ్లు ఆగాలనడం తీవ్ర ఆక్షేపనీయమని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవి, వెంకట్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పండుగ రోజు వరాలు కురిపిస్తారని ఆశించిన టీచర్లకు ఆశాభంగం కలిగిందని తెలిపారు. వెంటనే ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.