హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : సమాచార, ప్రజా సంబంధాలశాఖ-ఐఅండ్పీఆర్లో కొత్త డైరెక్టర్ నియామకంపై వివాదం మొదలైంది. ఏపీకి చెందిన ఓ అధికారికి ఆ పదవి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని శాఖలో ఉద్యోగులు చెప్తున్నారు. తాము తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నామని, కానీ ఇప్పుడు ఏపీకి చెందినవారికే పెద్దపీట వేస్తున్నారని, ఉన్నత బాధ్యతలు అప్పగిస్తున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రానికి చెందిన ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాజాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి డైరెక్టర్ పదవి కట్టబెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టు చెప్తున్నారు.
సదరు అధికారికి వ్యతిరేకంగా ఇప్పటికే 12 పేపర్లలో కథనాలు వచ్చాయని, ఆయన అవినీతిపై ఆరు ఎన్జీవోలు ఫిర్యాదు చేశాయని తెలిపారు. కానీ ఇప్పటివరకు ఆయనపై ఉన్నతాధికారులు విచారణ జరపకుండా కాపాడుతున్నారని చెప్పారు. ఇద్దరు ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడి, ఆయన పేరును ఐఅండ్పీఆర్ డైరెక్టర్ పదవికి ప్రతిపాదిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఆ నియామకాన్ని ఆమోదించకుండా తిరస్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.