ఎన్నో ఏండ్లుగా ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల భూమికి ‘బిగ్ టీం’ ఎసరు పెట్టేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారికంగా లేఅవుట్ చేసి ఫీజులు చెల్లించిన భూముల్లో కంటెయినర్ల ద్వారా పాగా వేసిన ప్రైవేట్ వ్యక్తులు, దర్జాగా అందులో పనులు కొనసాగిస్తున్నారు. దీనిపై భాగ్యనగర్ టీఎన్జీవోలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో ఈ వ్యవహారం కాస్తా మరో కీలక మలుపు తిరిగినట్టు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధం లేకుండానే కూకట్పల్లి కోర్టు ఉత్తర్వుల ఆధారంగా రెవెన్యూ అధికారులు సదరు వ్యక్తుల కోసం ఉద్యోగుల భూముల్లో సర్వే చేసినట్టు గుర్తించి ఉద్యోగ సంఘాల నేతలు అవాక్కయినట్టు తెలిసింది.
(స్పెషల్ టాస్క్బ్యూరో/హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): తమకు తెలియకుండానే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న తమ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నట్టు సమాచారం. అటు పోలీసు శాఖను కలిసినా, ఇటు రెవెన్యూ శాఖను కలిసినా సరైన స్పందన రాకపోవడంతో ఉద్యోగ సంఘాల నాయకులు దిక్కుతోచని స్థితిలో పడ్డట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రికార్డుపరంగా తమ ఆధీనంలోని భూమిని పరిరక్షించకపోగా రికార్డుల్లోలేని సబ్ డివిజన్స్ సర్వే నంబర్ల ఆధారంగా ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలోని సర్వేనంబరు 36, 37లో ఉన్నభాగ్యనగర్ టీఎన్జీవో భూములు క్రమంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతున్నాయి. తెరవెనుక ‘బిగ్ టీం’ కదుపుతున్న పావులతో రెవెన్యూ అధికారులు తోటి ఉద్యోగులకే ద్రో హం చేస్తూ భూములకు ఎసరు పెట్టేదిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది.
సర్వే నంబరు 37లో బసవతారకనగర్‌లోని ఎనిమిది ఎకరాలను ఆధీనంలోకి తీసుకున్న రెవెన్యూ శాఖ ప్రతిపక్షాలతో పాటు, ఇతరులెవరూ నిరుపేదలకు అండగా నిలువకుండా కట్టడి చేసింది. మరోవైపు సర్వేనంబరు 36లోని భూముల్లో ఏకంగా ప్రైవేట్ వ్యక్తులు కంటెయినర్లతో పాగా వేసినా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉద్యోగ సంఘాల నేతలు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేని, అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకట్, భాగ్యనగర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్ తదితరులు సీపీని కలిసి తమ భూమిని పరిరక్షించాలని వినతిపత్రం ఇచ్చారు. అనంతరం సీపీ సూచన మేరకు ఉద్యోగ సంఘాల నేతలు మాదాపూర్ డీసీపీ జీ వినీత్‌ను కలిశారు. ఈ సందర్భంగా సదరు ప్రైవేట్ వ్యక్తులు కూకట్పల్లి కోర్టు నుంచి తెచ్చుకున్న ఇంజక్షన్ ఆర్డర్‌ను చూపిస్తున్నారని పోలీసులు చెప్పడంతో సదరు నేతలు అవాక్కయినట్టు తెలిసింది. ఓవైపు గతంలోనే హైకోర్టు స్టేటస్ కో ఉన్న తర్వాత ఈ ఉత్తర్వులు ఎలా వచ్చాయని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ విషయంలో తామేమీ చేయలేమని అక్కడి నుంచి సమాధానం రావడంతో ఉద్యోగ సంఘాల నేతలు నిశ్శేష్టులై వెనుదిరిగినట్టు సమాచారం.
కేంద్ర బిందువులా రెవెన్యూ శాఖ
వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులకు కేటాయించిన భూములవి.. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ పరిరక్షించిన భూములవి.. అయితే సర్కారు ఆధీనంలో లేదంటే ఉద్యోగులకు కేటాయించాలి. కానీ ప్రస్తుతం రెండింటికీ భిన్నంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోవడం వెనుక రెవెన్యూ శాఖ కీలకంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీపీని కలిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు కూకట్పల్లి కోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తే అందులో విచిత్రకరమైన అంశాలున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. 2023 జనవరిలో సర్వేనంబరు 36లో తమ ప్లాట్లు ఉన్నాయంటూ 1980 దశకంలో డీ నర్సింగరావు నుంచి కొనుగోలు చేసినట్టుగా డాక్యుమెంట్లను చూపుతూ వినాయక్‌నగర్ హౌసింగ్ సొసైటీ పేరిట కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి ఆ సమయంలో భూములు ప్రభుత్వాధీనంలో ఉండటంతో పాటు రికార్డుపరంగా ప్రభుత్వానికే చెందుతాయి. కానీ కోర్టు ముందు ప్రభుత్వాన్ని కాకుండా టీఎస్ ఎన్జీవోను ఎక్స్ పార్టీగా చేర్చారు.
వాస్తవానికి ఈ పేరు మీద సొసైటీ లేకపోవడం ఒకవంతైతే.. అందులో పేర్కొన్న చిరునామా ఉన్న గన్‌ఫౌండ్రీలోని భవనాన్ని భాగ్యనగర్ టీఎన్జీవో అంతకుముందు కొన్ని సంవత్సరాల కిందటే అమ్ముకొని ఆబిడ్స్‌లోని వేరే భవనంలోకి వచ్చారు. దీంతో సదరు సొసైటీ నుంచి ఎలాంటి స్పందనా లేదంటూ న్యాయస్థానం ఎక్స్‌పార్టీగా పేర్కొంటూ ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ఆధారంగా రెవెన్యూ సర్వేయర్ 2024లో సర్వేనంబరు 36లో సర్వే చేసి ప్రైవేట్ వ్యక్తులకు భూమి చూపారనే విమర్శలు ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉంటే అది తమ భూమి అంటూ స్పందించాల్సిన రెవెన్యూ అధికారులు ఆ పని చేయకపోగా.. ఉద్యోగులకు సమాచారం ఇవ్వకుండానే ప్రైవేట్ వ్యక్తులకు పొజీషన్ చూపించారనే ఆరోపణలు వస్తున్నాయి.
రెవెన్యూ అధికారుల హైడ్రామా
రెవెన్యూ అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేందుకు మరికొన్ని చర్యలు బలాన్ని చేకూరుస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సర్వేనంబర్ 36, 37లో డీ నర్సింగరావు, ఇతరులు చూపుతున్న సబ్ డివిజన్స్ సర్వేనంబర్లు లేవని 2021లోనే కేసీఆర్ ప్రభుత్వానికి రంగారెడ్డి కలెక్టర్ పంపిన నివేదికలో స్పష్టంచేశారు. ప్రస్తుతం భూ భారతిలో సదరు వ్యక్తులు చూపుతున్న సబ్ డివిజన్స్ పేరిట వారి పేర్లు కనిపించడం లేదు. కానీ రాజేంద్రనగర్ ఆర్డీవో బసవతారకనగర్ 8 ఎకరాలను స్వాధీనం చేసుకునే క్రమంలో సర్వేనంబరు 37/లు, 37/రులోని 8 ఎకరాల భూమి అని స్పష్టంగా పేర్కొన్నారు.
ఆర్డీవో తన ఉత్తర్వుల్లో ఈ సబ్ డివిజన్స్ పేర్కొంటున్నారంటే రికార్డుపరంగా అవి ప్రభుత్వ ఆన్లైన్లో కనిపించాలని, అలా కనిపించడం లేదంటే అది ప్రభుత్వ భూమిగానే ఉన్నట్టు అని రిటైర్డ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సర్వేనంబర్ 36లో ప్రైవేట్ వ్యక్తులు కంటెయినర్లు వేసి పనులు చేస్తున్న భూములను ‘సర్వే నంబర్ 36/ఎ, 36/ఇ’గా పేర్కొన్నారు. కానీ ఇలాంటి సబ్ డివిజన్స్ ఏవీ భూ భారతి ఆన్లైన్లో కనిపించడం లేదు. అంటే అధికారికంగా రికార్డులకు ఎక్కలేదు. అలాంటప్పుడు రెవెన్యూ సర్వేయర్ సదరు వ్యక్తులకు సర్వే చేసి ఎలా భూమి చూపిస్తారు? ప్రభుత్వ రికార్డుల్లో లేకుండా ప్రైవేట్ వ్యక్తులు పనులెలా నిర్వహిస్తారు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని ప్రకారం రెవెన్యూ అధికారులు నిబంధనలను అటకెక్కించి కేవలం ‘బిగ్ టీం’ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కొసమెరుపు
సర్వే నంబర్ 36లో ప్రైవేట్ వ్యక్తులు కంటెయినర్లతో పనులు చేస్తున్న భూముల్లో 2010లో ఉద్యోగులు అధికారికంగా లేఅవుట్ చేశారు. ఆ మేరకు అప్పట్లో 142.15 ఎకరాలకు ఫీజు చెల్లించడంతోపాటు నిబంధనల ప్రకారం వట్టినాగులపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మార్ట్గేజ్ డీడ్ చేశారు. అవిరద్దు కాకుండానే రెవెన్యూ అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు ద్వారాలు తెరిచారు.