హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ‘ఉద్యోగుల హక్కుల సాధన సభ’కు ప్రభుత్వం అనుమతివ్వాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. అనుమతిస్తే శాంతియుతంగా నిరసనలు తెలుపుతామని, లేదంటే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. అనుమతివ్వకపోతే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా ఈ నెల 10న సభను జరిపి తీరుతామని జేఏసీ తేల్చిచెప్పింది. శనివారం నాంపల్లిలోని టీఎన్జీవోభవన్లో జరిగిన ఉద్యోగుల సన్నాహక సభ అనంతరం టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేని(ముజీబ్), టీజీవో ప్రధాన కార్యదర్శి బీ శ్యామ్ మీడియాతో మాట్లాడారు. సభ కోసం నాలుగు ప్రాంతాల్లో అనుమతి కోరుతూ దరఖాస్తు చేశామని, ఏదో ఒక చోట సభ నిర్వహణకు అనుమతినివ్వాలని వారు డిమాండ్ చేశారు.
కోటిన్నర మేం దాచుకున్నవే : శ్యామ్
రిటైర్డ్ ఉద్యోగులకు కోటిన్నర చెల్లిస్తున్నామన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను టీజీవో ప్రధాన కార్యదర్శి బీ శ్యామ్ ఖండించారు. ఆ కోటిన్నర తాము దాచుకున్న డబ్బులేనని స్పష్టంచేశారు. ప్రభుత్వం ఇచ్చేది గ్రాట్యుటీ మాత్రమేనని, ఇది గరిష్ఠంగా రూ.16 లక్షలు మాత్రమేనని స్పష్టంచేశారు. జీపీఎఫ్, జీఐఎస్, జీఎల్ఐ ఉద్యోగులు దాచుకున్న డబ్బులేననే విషయాన్ని గమనించాలని సూచించారు. మేం దాచుకున్న డబ్బులు మాకిచ్చి గొప్పలు చెప్పుకోవడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు యావత్ ఉద్యోగలోకాన్ని తీవ్రంగా బాధించాయని తెలిపారు. ఉద్యోగులను చులకనచేసే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. ఉద్యోగులంతా భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీజీవో, టీఎన్జీవో సంఘాల బాధ్యులు సత్యనారాయణగౌడ్, కస్తూరి వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, భీమ్‌సింగ్, విక్రమ్‌కుమార్, కృష్ణాయాదవ్, రామారావు, శ్రీనేశ్‌కుమార్, ఉమారెడ్డి, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
ఇప్పటికే 32 నెలల సమయమిచ్చాం : ముజీబ్
సమస్యల పరిష్కారం కోసం రెండేండ్లు ఆగాలన్న సీఎం వ్యాఖ్యలపై టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ ఘాటుగా స్పందించారు. ఇప్పటికే 32 మాసాల సమయమిచ్చాం. ఇంకా ఎంతకాలం ఆగాలి. ఇక సమమిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఉద్యోగుల ఓపికను చేతగాని తనంగా భావించొద్దని తెలిపారు. ఉద్యోగుల హక్కుల సాధన సభను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం సహా కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా సభను నిర్వహించి తీరుతామని స్పష్టంచేశారు. తమది ధర్మపోరాటమని, ఉద్యోగుల ధర్మాగ్రహానికి కుట్రలు పటాపంచలు కావడం ఖాయమని చెప్పారు. ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి సభకు హాజరుకావాలని ముజీబ్ పిలుపునిచ్చారు.