ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 02:31:03

కరోనాకు సాంకేతిక చెక్‌

కరోనాకు సాంకేతిక చెక్‌

  • డ్రోన్ల సాయంతో అనేక సర్వీసులు..  పలు సమస్యలను పరిష్కరించిన టెక్నాలజీ 
  • డబ్ల్యూఈఎఫ్‌ దక్షిణాసియా ప్రాంతీయ సమావేశంలో మంత్రి కే తారకరామారావు

తెలంగాణలోని పలు పట్టణాల్లో క్రిమిసంహారకాల పిచికారీ కోసం డ్రోన్లను కూడా ఉపయోగించాం. దీనిద్వారా సంప్రదాయ పద్ధతుల్లో కన్నా మెరుగ్గా, వేగంగా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి వీలవుతుందని ప్రజల్లో కూడా భరోసా కలిగింది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజల కదలికల నియంత్రణకోసం పోలీసులు డ్రోన్ల ద్వారా పర్యవేక్షించారు.

- డబ్ల్యూ ఈఎఫ్‌ వెబినార్‌లో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా ఆపత్కాలంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రభుత్వాలకు, ప్రజలకు ఎంతో ఉపయోగపడిందని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం చాలాచోట్ల టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకొంటున్నదని పేర్కొన్నారు. గురువారం ప్రపంచ ఆర్థిక ఫోరం.. రీజినల్‌ యాక్షన్‌ గ్రూప్‌ ఫర్‌ సౌత్‌ ఏషియా పేరుతో వెబినార్‌ యాప్‌ ద్వారా నిర్వహించిన సమావేశంలో.. కొవిడ్‌-19 ను ఎదుర్కోవడంలో టెక్నాలజీ పాత్రపై మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. సామాన్య మనిషి జీవితంలో మార్పు తీసుకురాలేని సాంకేతిక పరిజ్ఞానం వృథా అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎప్పుడూ చెప్తుంటారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి టెక్నాలజీని ఉపయోగిస్తున్నామన్నారు. 

కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులను అధిగమించేందుకు నూతన సాంకేతిక పరిష్కారాలు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.  ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ దక్షిణాసియాలోని వివిధ దేశాల మంత్రులు, పలు కంపెనీల ప్రతినిధులు, ప్రముఖలతో మాట్లాడారు. వైరస్‌ నివారణకు సాంకేతిక పరిజ్ఞానం తమకు బాగా ఉపయోగపడిందని తెలిపారు. ఎప్పటికప్పుడు కేంద్రంతోపాటు, స్థానికంగా జిల్లా, గ్రామ అధికారులతో సంభాషించడానికి టెక్నాలజీ ఉపయోగపడిందని, పలు పట్టణాల్లో డిస్‌ ఇన్ఫెక్టంట్ల పిచికారీ కోసం డ్రోన్లను కూడా ఉపయోగించామని పేర్కొన్నారు. దీనిద్వారా సంప్రదాయ పద్ధతుల్లో కన్నా మెరుగ్గా, వేగంగా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి వీలవుతుందని ప్రజల్లో కూడా భరోసా కలిగిందని తెలిపారు. 

లాక్‌డౌన్‌ సమయంలో ప్రజల కదలికల నియంత్రణకోసం పోలీసులు డ్రోన్ల ద్వారా పర్యవేక్షించారని చెప్పారు. వైరస్‌ వ్యాప్తి, ఇతర అంశాలను ప్రజలకు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక యాప్‌, వెబ్‌సైట్‌ను రూపొందించిందని మంత్రి కేటీఆర్‌ వివరించారు. ప్రజలకు రేషన్‌ సరుకులు అందించడానికి కూడా ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిందని చెప్పారు. ఈ సంక్లిష్ట సమయంలో అనేక సమస్యలకు పరిష్కారం ఇవ్వడంతోపాటు నూతన అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు అవకాశాలను కల్పించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌తోపాటు బంగ్లాదేశ్‌ విదేశాంగశాఖ మంత్రి మహ్మమద్‌ షహారియర్‌ ఆలమ్‌, మాల్దీవ్స్‌ ఆర్థికాభివృద్ధిశాఖ మంత్రి ఫయాజ్‌ ఇస్మాయిల్‌, సింగపూర్‌ ఐటీ, కమ్యూనికేషన్లశాఖ మంత్రి ఎస్‌ ఈశ్వరన్‌, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం అధ్యక్షుడు బోరే బెండెతోపాటు పలువురు కీలక నేతలు వివిధ దేశాల మేధావులు, నిఫుణులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. 


logo