హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) 2013లో ప్రకటించిన అవార్డును అమల్లోకి తీసుకొచ్చే అంశంపై కేంద్ర జల్‌శక్తి శాఖ ఈ నెల 18న అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ మేరకు బేసిన్‌లోని రాష్ర్టాలైన తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు సమాచారం అందించింది. కృష్ణా జలాల పంపిణీ కోసం జస్టిస్ బ్రిజేశ్ కుమార్ నేతృత్వంలో 2004లో ఏర్పాటైన ట్రిబ్యునల్-2.. 2013లో తుది తీర్పును ప్రకటించింది.
ఆ తీర్పులోని పలు అంశాలను వ్యతిరేకిస్తూ నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ట్రిబ్యునల్-2 తీర్పు అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నాటి నుంచి అది పెండింగ్‌లో ఉండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని, అవార్డును పాక్షికంగానైనా అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని కోరడంతోపాటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ అవార్డు అంశాలపై చర్చించేందుకు జల్‌శక్తి శాఖ 18న అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నది.