హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు, ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల్‌మీడియా వారియర్లపై అడ్డగోలు కేసులు పెడుతూ వేధిస్తున్నది. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్, బీఆర్ఎస్ సోషల్‌మీడియా కన్వీనర్ దిలీప్ కొణతం, వారియర్లు అశోక్‌రెడ్డి, గౌతమ్ పోతగోని, శశిధర్‌గౌడ్, సల్వాజీ మాధవరావుపై ఇప్పటికే అనేక కేసులు పెట్టి జైళ్లకు పంపించింది.
పోలీసులతో అదనుచూసి అరెస్టు చేసి పీటీ వా రెంట్ వేసి మళ్లీ అదుపులోకి తీసుకోవడం చేస్తున్నది. ‘కాంగ్రెస్ రాష్ర్టానికి పట్టిన చీడ’ అని బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్‌ను శశిధర్‌గౌడ్ అనే యువకుడు నల్లబాలు పేరిట నిర్వహిస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి రీట్వీట్ చేశాడు. రీ ట్వీట్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అర్ధరాత్రి యువకుడి ఇంటికి వెళ్లి అతడిని అరెస్టు చేశారు. 16రోజులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కరీంనగర్ జైలు నుంచి గురువారం విడుదల కావాల్సి ఉండగా, కాంగ్రెస్ సర్కారు మరో కొత్త రీట్వీట్ కేసులో శశిధర్‌గౌడ్‌ను మళ్లీ అరెస్టు చేయించిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఓ పోలీస్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్న పోలీసులు.. ఉదయం 6:30 గంటలకు జైలుకు వెళ్లి అక్కడే శశిధర్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విడుదల కాబోతున్న శశిధర్‌గౌడ్‌ను తీసుకొచ్చేందుకు జైలు వద్దకు వెళ్లిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఒక కేసులో అరెస్టు చేయడం, పీటీ వా రెంట్ వేయడం.. మళ్లీ జైలుకు పంపడం నిత్యకృత్యంగా మారింది.