ఎల్కతుర్తి, అక్టోబర్ 28: జాతీయ స్థాయిలో ఉత్తమ మహిళా సమాఖ్యగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల సమాఖ్య ఎంపికైంది. ఏపీఎంఏఎస్ (ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి సంస్థ), ఎస్బీఐ, ఇతర ఏజన్సీల మద్దతుతో ఏటా ఉత్తమ పనితీరు కనబర్చిన ఎస్‌హెచ్‌జీ (స్వయం సహాయక సంఘాలు)లకు ఈ అవార్డులను అందిస్తున్నారు. ఏపీఎంఏఎస్ ఎస్‌హెచ్‌జీల పనితీరుపై నవంబర్ 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాతీయ సదస్సుల్లోనే అవార్డులను అందిస్తారు. జాతీయ స్థాయిలో ఉత్తమ మహిళా సమాఖ్యగా ఎల్కతుర్తి ఎంపికవడంపై ఐకేపీ రవీందర్ హర్షం వ్యక్తంచేశారు.
కాళోజీ కళాక్షేత్రం వద్ద ఉద్రిక్తత
హనుమకొండ, అక్టోబర్ 28: హనుమకొండ బాలసముద్రంలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రంలో కళాకారుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ చౌరస్తా నుంచి కాళోజీ కళాక్షేత్రం వరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థి సంఘాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు వారిని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునీల్,ఎస్‌ఐఎస్‌వో రాష్ట్ర అధ్యక్షుడు దూడపాక నరేశ్ మాట్లాడుతూ.. కళాకారుల విగ్రహాలను కళాక్షేత్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.