Peddapalli | పెద్దపల్లి, ఏప్రిల్22 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని బృందావన్ గార్డెన్లో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు కార్మిక నాయకులతోపాటు టీఎస్ఎన్పీడీసీఎల్ కరీంనగర్ ఎంఆర్టీ డివిజన్లో టెస్టర్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తులసి కూడా పాల్గొన్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతోపాటు మంత్రి శ్రీధర్‌బాబుతో వేదికను పంచుకొని ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు.
ఈ ఘటనపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి.. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకి మద్దతుగా నిర్వహించిన సభావేదికను పంచుకోవడం ప్రభుత్వ ఉద్యోగుల క్రమశిక్షణారాహిత్యానికి నిదర్శనమని చెప్తున్నారు. ఇటీవల సిద్దిపేటలో కేవలం ఒక సమావేశంలో పాల్గొన్నారనే కారణంతో వందకు పైగా ఉద్యోగులను సస్పెండ్ చేసిన ఈసీ.. ఈ ఘటనపై ఎలా స్పందిస్తుందో చూడాలని పలువురు పేర్కొంటున్నారు.