హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లో పదోన్నతులిచ్చాకే.. బదిలీలు చేపట్టాలని విద్యు త్తు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించాయి. చాలా కాలంగా పదోన్నతులు లేవని, కానిప్పుడు పదోన్నతులు లేకుండా బదిలీలు చేపట్టడం తగదని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1,104 యూనియన్ అభిప్రాయపడింది. యూనియన్ ప్రధాన కార్యదర్శి సాయిబాబు, అదనపు ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ ట్రాన్స్‌కో సీఎండీ కి వినతిపత్రాన్ని సమర్పించారు. విద్యుత్తు సంస్థల్లో అన్ని క్యాడర్లల్లో పదోన్నతులు కల్పించాలని, అర్టిజన్లకు హైయ్య ర్ గ్రేడ్ పదోన్నతులు కల్పించాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ -327 ప్రధాన కార్యదర్శి శ్రీధర్ వినతిపత్రాన్ని సమర్పించారు. జెన్కో ట్రాన్స్ఫర్ పాలసీ మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని తెలంగాణ విద్యుత్తు ఇంజినీర్స్ అసొసియేషన్ అధ్యక్షుడు నెహ్రూ, ప్రధాన కార్యదర్శి భాస్కర్ వినతిపత్రాన్ని సమర్పించారు.
వీఆర్వోలు, వీఆర్ఏలను మళ్లీ తీసుకోవాలి: ట్రెసా
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): వీఆర్వోలను, వీఆర్ఏలను తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకోవాలని ట్రెసా రాష్ట్ర నేతలు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి తిరిగి శాఖలోకి తీసుకోవాలని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో వారు మంత్రిని కలిశారు. ఇటీవల 9 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అర్హత కలిగిన మిగతా వారికీ పదోన్నతులు కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షుడు వగా రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్, ఉపాధ్యక్షులు రాంరెడ్డి, నిరంజన్‌రావు, నేతలు దేశ్య, రమణ్‌రెడ్డి పాల్గొన్నారు.
‘ఆర్టీసీ’ జేఏసీ ఎన్నిక
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీని ఎన్నుకున్నాయి. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జేఏ సీ చైర్మన్‌గా ఎంప్లాయీస్ యూనియన్(ఈ యూ) ప్రధాన కార్యదర్శి ఎదుల వెంకన్న, కో చైర్మన్‌గా టీఎంయూ ప్రధాన కార్యదర్శి ఎన్ థామస్‌రెడ్డి, కన్వీనర్‌గా ఎండీ మౌ లానా, కో కన్వీనర్లను ఎన్నుకున్నారు. బీకేఎస్, బీడబ్ల్యూఎస్, ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ ప్రతినిధులు హాజరయ్యారు.
పెంట్లవెల్లి కేజీబీవీ ఎస్వోపై వేటు వంట సిబ్బంది కూడా తొలగింపు..
నాగర్‌కర్నూల్, ఆగస్టు 6: నాగర్‌కర్నూల్ జిల్లాలోని పెంట్లవెల్లి కేజీబీవీ ప్రత్యేకాధికారితోపాటు వంట సిబ్బందిపై వేటుపడింది. విద్యాలయంలో రెండు రోజులుగా విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనకు బాధ్యులైన ప్రత్యేకాధికారి, వంట సిబ్బందిపై కలెక్టర్ సంతోష్ చర్యలు తీసుకున్నారు. పెంట్లవెల్లి కేజీబీవీలో విద్యార్థినులకు అందించే ఆహారం విషయంలో పాఠశాల ప్రత్యేకాధికారి(ప్రిన్సిపాల్) స్వప్న, వంట సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తేల్చారు. ప్రత్యేకాధికారి స్వప్న, వంట సిబ్బంది కృష్ణమ్మ, రాణి, రాధమ్మ, అలివేలును కాంట్రాక్టు ఉద్యోగం నుంచి తొలగిస్తూ డీఈవో గోవిందరాజులు ఉత్వర్వులు జారీ చేశారు. హిందీ సీఆర్టీగా పనిచేస్తున్న సలహే బేగంకు ప్రత్యేకాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.