Telangana | హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ విద్యుత్తు ప్లాంట్లపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యుత్తు విచారణ సంఘం నివేదిక పాత సీసాలో కొత్తసారా అన్న ఆరోపణలొస్తున్నాయి. ఈ నివేదిక ఆసాంతం పాత నివేదికే నా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. గతంలో విచారణ సంఘం చైర్మన్‌గా ఉ న్న జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నివేదికనే కొత్త క మిషన్ ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలుస్తున్నది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్‌ప్లాంట్ల నిర్మాణంపై తొలుత జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి విచారణ సంఘాన్ని ప్రభుత్వం ఏర్పా టు చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుతో జస్టిస్ న ర్సింహారెడ్డి తప్పుకోగా, ఆయన స్థానంలో జస్టి స్ మదన్ బీ లోకూర్ అధ్యక్షతన మరో విచార ణ సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే జస్టిస్ నర్సింహారెడ్డి నివేదికనే తీసుకు ని, దానినే మదన్ బీ లోకూర్ సర్కారుకు సమర్పించినట్టుగా తెలుస్తున్నది. జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి గతంలో నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడిన మాటల్లో కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని ఆయన ముందే నిర్ణయించుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమైంద ని, ఆయన ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యల ఆధారంగా విచారణ సంఘం నుంచి ఆయనను తప్పుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మళ్లీ అదే నివేదికను జస్టిస్ మదన్ బీ లోకూర్ తిరిగి సమర్పించారు.
జస్టిస్ మదన్ బీ లోకూర్ విద్యుత్తు విచారణ సంఘం ఏ ఒక్కరినీ ప్రత్యక్షంగా విచారించకుండానే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మూడు నెలల కాలంలో ఒక్కరంటే ఒక్కరినీ విచారణకు పిలవలేదు. ఎవరి నుంచీ వాంగ్మూలం తీసుకోలేదు. విచారణ సంఘమన్న తర్వాత సంబంధిత వ్యక్తులను విచారించాలి. న్యాయాన్యాలను పరిశీలించి పక్షపాతం లేకుండా నివేదిక సమర్పించాలి. కానీ ఇవేవీ లేకుండానే మదన్ బీ లోకూర్ విచారణ సంఘం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.
బీఆర్కే భవన్లో విచారణ సంఘ కార్యాలయం ఉండగా, మదన్ బీ లోకూర్ మూడునెలల్లో 10 రోజులు కూడా కార్యాలయానికి రాలేదు. మొదట్లో కొద్దిరోజులు వచ్చి, కొన్ని దస్ర్తాలను ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆ తర్వాత రెండు నెలకు హైదరాబాద్ వచ్చి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం ఈ నివేదికను ఇంతవరకు బయటపెట్టలేదు. కానీ క్యాబినెట్ సమావేశంలో చర్చ అంటూ తన అనుకూల మీడియాకు లీకుల మీద లీకులిస్తున్నది. ఆ మీడియా అవాస్తవాలను వండివారుస్తున్నది. ప్రచారంలో ఉన్న ఆరోపణలు, వాటికి సంబంధించిన వాస్తవాలిలా ఉన్నాయి.
ఆరోపణ: కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్‌ప్లాంట్ కారణంగా రానున్న 25 ఏండ్ల పాటు రూ.9 వేల కోట్ల భారం పడనున్నది. సబ్ క్రిటికల్ ప్లాంట్ ఆగ్జిలరీ కన్జంప్షన్ (ప్లాంట్ సొంతంగా వినియోగించే కరెంట్), హీట్‌రేట్, నిర్వహణ ఖర్చులు రూ. 350 కోట్లు అదనం.
వాస్తవం: 2014 వరకు దేశంలో సబ్ క్రిటికల్ ప్లాంట్లపై నిషేధమేమీ లేదు. 2017 వరకు అమల్లో ఉండే పంచవర్ష ప్రణాళిక సైతం సబ్ క్రిటికల్ ప్లాంట్లు నిర్మించుకోవచ్చని స్పష్టంచేసింది. అయినా 2014 నాటికి దేశంలో 90 శాతం విద్యుత్తు ప్లాంట్లు సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే కట్టారు. ఎన్టీపీసీ ప్లాంట్లల్లో 90 శాతం సబ్‌క్రిటికల్ ప్లాంట్లే. ఒకటి, రెండు మాత్రమే సూపర్ క్రిటికల్ ప్లాంట్లున్నాయి. 2015 పారిస్ ఒప్పందంలో భారత్ చేరిన తర్వాతే సూపర్ క్రిటికల్ ప్లాంట్ల నిర్మాణం ప్రారంభమైంది. ఈ ప్లాంట్‌ను నవరత్న సంస్థ అయిన బీహెచ్ఈఎల్ నిర్మించింది. ఈ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం అన్ని రకాల అనుమతులిచ్చింది. అలాంటప్పుడు భారం ఎలా పడుతుందన్నది ప్రధాన ప్రశ్న!
ఆరోపణ: 1000 మెగావాట్ల తరలింపునకు పీజీసీఐఎల్ కారిడార్ బుకింగ్ చేసుకోగా, ఇందుకు రూ.635 కోట్లు చెల్లించారు. మరో 1000 మెగావాట్ల కారిడార్ రద్దు చేసుకున్నందుకు రూ.261 కోట్లు పరిహారం కింద చెల్లించాల్సి ఉండగా, ఇది అప్పిలేట్ అథారిటీ పరిధిలో ఉన్నది.
వాస్తవం : ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు తీసుకురావాలంటే డెడికేటెడ్ కారిడార్ అవసరం. ఈ కారిడార్ కోసం పీజీసీఐఎల్‌తో లైన్ ట్రాన్స్మిషన్ అగ్రిమెంట్ (ఎల్‌టీఏ) చేసుకోవాల్సి ఉన్నది. ఎల్‌టీఏ లేకుండా డెడికేటెడ్ లైన్‌ను పీజీసీఐఎల్ కేటాయించదు. పైగా పీజీసీఐఎల్ షరతుల ప్రకారం ఎవరి నుంచి విద్యుత్తు కొంటున్నారో వారితో చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్‌ను సైతం సమర్పించాలి. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ 2000 మెగావాట్ల కారిడార్‌ను బుక్‌చేసింది. కానీ 1000 మెగావాట్లకు సంబంధించి ఛత్తీస్‌గఢ్ నుంచి ఆశించిన మేరకు కరెంటు సరఫరా కాకపోవడంతో వెయ్యి మెగావాట్ల కారిడార్‌ను రద్దుచేశారు. ఈ రద్దు వల్ల విద్యుత్తు సంస్థలకు ఎలాంటి నష్టం జరగలేదు. దీనిపై అప్పిలేట్‌లో విచారణ జరుగుతున్నది.
ఆరోపణ: పిట్‌హెడ్ ప్లాంట్ల స్థానంలో బొగ్గుగనులకు దూరంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టడంతో ఏటా రూ.1,600 కోట్లు బొగ్గు రవాణాకే ఖర్చువుతున్నది.
వాస్తవం : పిట్‌హెడ్ ప్లాంట్లు కట్టినా లోడ్ డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ లాసెస్‌ను తగ్గించాలని, దక్షిణ తెలంగాణ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని కేసీఆర్ సర్కారు దామరచర్లను ఎంపికచేసింది. పైగా దామరచర్లలో 4 వేల మెగావాట్ల భారీ థర్మల్‌ప్లాంట్ నుంచి పెద్ద మొత్తంలో ఫ్లైయాష్ వెలువడుతుంది. దీని డిస్పోస్ పెద్ద సమస్య. దామరచర్ల సమీపంలోని సిమెంట్ పరిశ్రమలు ఈ ైప్లెయాష్ను వాడుకునే వీలున్నది. దేశంలో కోల్ లింకేజీ లేకున్నా అనేక ప్రాంతాల్లో థర్మల్‌ప్లాంట్లు కట్టారు.
ఉమ్మడి ఏపీలో బొగ్గు గనులకు దూరంగా ఉన్న ఆర్టీపీపీ, వీటీపీఎస్లను నిర్మించారు. జజ్జర్ (హర్యానా), గోవింద్వాలా సాహెబ్ (పంజాబ్), రాయచూరు (కర్ణాటక), బళ్లారి (కర్ణాటక), మెట్టూరు (తమిళనాడు)ల్లో బొగ్గుగనులకు దూరంగా ఉన్నా థర్మల్ప్లాంట్లను నిర్మించారు. ఒకవేళ పిట్‌హెడ్ ప్లాంట్లు నిర్మించినా విద్యుత్తు సరఫరా వ్యవస్థల నిర్మాణ వ్యయం పెరుగుతుంది.
ఆరోపణ : కేసీఆర్ డిస్కంలను ఆర్థికంగా కుప్పకూల్చారు. ఆయన మెప్పుకోసం విద్యుత్తు సంస్థలు మునుగుతున్నా పట్టించుకోలేదు. రాబోయే 25 ఏండ్ల పాటు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి
వాస్తవం : కేసీఆర్ పదేండ్ల పాలనలో వి ద్యుత్తు విషయంలో అన్ని రకాల నిబంధనల ను పాటించారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ -2003 ప్ర కారం అన్ని రకాల అనుమతులు పొందారు. న్యాయ ప్రతిపత్తి గల విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) తీర్పులకు లోబడే సర్కారు వ్యవహరించింది. ఈఆర్సీ వెలువరించిన తీ ర్పులపై కావాలంటే ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రి బ్యునల్‌కు వెళ్లవచ్చు. కానీ అలా చేయలేదు. రెండు విచారణ సంఘాలను ఏర్పాటు చేసి, అనుకూలంగా నివేకదిను తెప్పించుకున్నారు.
ఆరోపణ: ఛత్తీస్‌గఢ్ ఒప్పందంతో రూ. 3,642 కోట్ల నష్టం జరిగింది. అప్పట్లో కేరళలో యూనిట్ కరెంట్ రూ.3.60 కే లభించేది. కానీ, రూ.3.90 పెట్టి యూనిట్ కొన్నారు. ఆ తర్వాత ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట యూనిట్‌ను రూ.4.50కు కొన్నారు. ఇక ఛత్తీస్‌గఢ్ వెయ్యి మెగావాట్ల కరెంట్ ఇవ్వలేదు. దీంతో ఓపెన్ మార్కెట్లో విద్యుత్తు కొనుగోలు చేయడంతో రూ.2 వేల కోట్ల నష్టం జరిగింది. చెల్లింపుల్లో జాప్యం కారణంగా వడ్డీలు, పెనాల్టీల రూపంలో రూ.750 కోట్లు చెల్లించారు.
వాస్తవం: దక్షిణాది రాష్ర్టాల్లో ఎక్కడా మిగులు విద్యుత్తు లేదు. తెలంగాణ ఏర్పడేనాటికే 2,700 మెగావాట్ల విద్యుత్తు లోటు ఉన్నది. ఏపీ నుంచి 1500 మోగావాట్లు, గ్యాస్ ఆధారిత ప్లాంట్ల నుంచి రూ.900 మోగావాట్ల విద్యుత్తు నిలిచిపోయింది. దీంతో మొత్తంగా తెలంగాణ 5 వేల మెగావాట్ల విద్యుత్తు లోటులో ఉన్నది. ఈ విద్యుత్తు సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకున్నది. ఈ ఒప్పందాన్ని ఇరురాష్ర్టాల ఈఆర్సీలు ఆమోదించాయి.