హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): జెన్కో ఇంజినీర్ల శ్రమ.. తక్కువ ఖర్చుతో ఎట్టకేలకు శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలోని నాలుగో యూనిట్లో శనివారం నుంచి తిరిగి విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైం ది. 2020 ఆగస్టు 20 నాడు జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగో యూనిట్ కాలిపోయింది. ఆ ఒక్కటి మినహా.. మిగతా ఐదు యూనిట్లు విద్యుదుత్పత్తి చేస్తూనే ఉన్నాయి. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసిన నాలుగో యూనిట్‌ను శనివారం సాయంత్రం 5.07 గంటలకు ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీళ్లతో విద్యుదుత్పత్తి ప్రారంభించారు. మరమ్మతుల తరువాత ప్రారంభించిన తొలిరోజే గరిష్ఠంగా 145 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగింది. అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన నాలుగో యూనిట్ సొంతంగానే బాగు చేయాలని జెన్కో ఉన్నతాధికారులు కృతనిశ్చయం తో నిర్ణయం తీసుకున్నారు. జపాన్ సాంకేతికతను లోతుగా అధ్యయనం చేశారు. మూ డేండ్ల తర్వాత కేవలం 50 కోట్లతో మనోళ్లే యూనిట్‌ను పునరుద్ధరించారు. యూనిట్లో విద్యుదుత్పత్తి ప్రారంభించడంతో అన్ని యూ నిట్‌లలో ప్రారంభించినట్లయ్యింది. జెన్కో డైరెక్టర్ సీహెచ్ వెంకటరాజం వారం రోజులుగా శ్రీశైలంలోనే ఉండి సమన్వయం చేశారు. సీఈ టెక్నికల్ హనుమాన్, శ్రీశైలం విద్యుత్తు స్టేషన్ సీఈ సూర్యనారాయణ, ఎస్ఈ వెంకటవర్మ బృందం నాలుగో యూనిట్‌ను విజయవతంగా పునరుద్ధరించడంలో భాగస్వామ్యమయ్యింది. నాలుగో యూనిట్‌ను మరమ్మతులు చేసి, పునరుద్ధరించడంలో పాలుపంచుకున్న వారిని సీఎండీ అభినందించారు.