పెద్దపల్లి : పెద్దపల్లి( peddapalli) జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీలో నిర్మించిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(super thermal power project)లో తొలిసారిగా విద్యుదుత్పత్తి నమోదైంది. ఏపీ పునర్వస్థీకరణ చట్ట ప్రకారం తెలంగాణకు కేటాయించిన 4వేల మెగావాట్లలో ఫేస్ 1 కింద నిర్మించిన అల్ట్రా సూపర్ క్రిటికల్ 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి.
ఇందులో భాగంగా ప్రథమంగా 800మెగావాట్ల 1వ యూనిట్లో గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విద్యుదుత్పత్తి ప్రారంభం కాగా శుక్రవారం మధ్యాహ్నం నాటికి 104.9మెగావాట్ల విద్యుతుద్పత్తి నమోదైనట్లు యాజమాన్యం వెల్లడించింది. విద్యుదుత్పత్తి కోసం ఇటీవల కొన్ని రోజులపాటు ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్లు నిర్వహించారు. సాంకేతిక సమస్యలు ఏర్పడినా వాటిని అధిగమించిన అధికారులు యూనిట్ సక్సెస్‌తో ఉత్పత్తయిన విద్యుత్‌ను పవర్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.
విద్యుదుత్పత్తి సక్సెస్ నేపథ్యంలో అధికారులు(officials) కంట్రోల్ గదిలో సంబురాలు చేసుకున్నారు. కేక్‌కట్ చేసి స్వీట్లు పంచారు. కాగా ప్రాజెక్టుకు ఇటీవలే ఎన్టీపీసీకి సింగరేణి నుంచి చేసుకున్న 4.0 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు దిగుమతి ఒప్పందం చేసుకున్నారు. 1వ యూనిట్లో చివరిసారిగా ట్రయల్ రన్ల ప్రక్రియ విజయవంతం కావడంతో యూనిట్‌ను ఉత్పత్తి దశలోకి తెచ్చేందుకు ఈ నెల 14న అధికారులు యూనిట్‌ను లైటాఫ్ చేశారు. వారం రోజుల అనంతరం 1వ యూనిట్లో విద్యుదుత్పత్తి నమోదైందని అధికారులు వెల్లడించారు.