హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ రాత పరీక్షలపై ఎన్నికల ఎఫెక్ట్ పడనున్నది. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలు వాయిదా పడతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖలో 5,089 టీచర్ ఉద్యోగాల నియామకానికి గత సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదలైంది. 21లోగా దరఖాస్తుకు అవకాశం ఉన్నది. నవంబర్ 20 నుంచి 30 వరకు డీఎస్సీ నిర్వహణకు గతంలోనే షెడ్యూల్ విడుదల చేశారు. నవంబర్ 22న స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ), 23న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ), 24న భాషాపండితులు, 25 నుంచి 30 వరకు ఎస్జీటీ రాత పరీక్షలు జరగాల్సి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30నే నిర్వహించనున్నారు. దీంతో డీఎస్సీ పరీక్షలు జరగడం అనుమానంగానే కనిపిస్తున్నది. ఇదే అంశంపై ఓ అధికారిని వివరణ కోరగా.. పరీక్ష రోజు, పరీక్షకు రెండు రోజుల ముందు వరకు పరీక్షలు నిర్వహించడం కుదరదని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని సంప్రదించి తగు నిర్ణయం తీసుకొంటామని తెలిపారు.