హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌కు 44 గంటల ముందు నుంచే ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (టీఎస్ఈసీ) స్పష్టంచేసింది. మూడు విడతల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని ఎప్పుడు ముగించాలో పేర్కొంటూ ఎస్ఈసీ కార్యదర్శి మంద మకరందు మంగళవారం ఆదేశాలను జారీచేశారు. తొలి విడతకు మంగళవారం సాయంత్రం 5.00 గంటలకు, రెండో విడతకు 12న సాయంత్రం 5.00 గంటలకు, తుది విడత 15న సాయంత్రం 5.00 గంటలకు అన్ని రకాల ప్రచారాలను బంద్ చేయాలని ఆదేశించారు. బహిరంగ సభలు నిర్వహించవద్దని, టీవీ చానళ్లు, రేడియో తదితర ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచార సామగ్రిని ప్రదర్శించడం లేదా ప్లే వంటివి చేయవద్దని పేర్కొన్నారు. సంగీత కచేరీలు, నాటకాలు లేదా ఇతర వినోద కార్యక్రమాల ద్వారా ఎన్నికల ప్రచారం చేయడం నిషిద్ధమని తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 214 (2) ప్రకారం.. రెండేండ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు శిక్షలను విధించే అవకాశం ఉంటుందని ఎస్ఈసీ హెచ్చరించింది. పోటీచేసే అభ్యర్థులు, ప్రచార నిర్వాహకులు, ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జులు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలి ; ప్రజలను పట్టించుకోని సర్కారుకు బుద్ధి చెప్పండి
ఇల్లెందు, డిసెంబర్ 9: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాధినేని వెంకటేశ్వరరావు, ఆవునూరి మధు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని పార్టీ డివిజన్ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ అభ్యర్థులతో కలిసి వారు మాట్లాడారు. ఆరు గ్యారెంటీల పేరు తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతుబంధు, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళా పింఛన్లు, నిరుద్యోగ భృతి, కౌలు రైతులకు ఆర్థిక సాయం, రైతులకు యూరియా అందించలేక తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ సర్కా రుకు బుద్ధిచెప్పే అవకాశం దక్కిందని చెప్పారు. న్యూడెమోక్రసీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మె జార్టీతో గెలిపించాలని కోరారు.