అశ్వారావుపేట, సెప్టెంబర్ 6 : రూ.4 వేల పింఛన్ ఎప్పుడిస్తారు.. సార్ అంటూ ఒక వృద్ధుడు ఎమ్మెల్యేను నిలదీయడంతో సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే తడబడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో చోటుచేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల సంబురాల్లో భాగంగా శనివారం తిప్పనపల్లిలో ఎమ్మెల్యే ఆదినారాయణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతుండగా.. ఓ వృద్ధుడు రూ.4 వేల పింఛన్ పెంపుపై ఎమ్మెల్యేను నిలదీశాడు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతామన్నారు.. ఎప్పుడు పెంచుతారు సార్ అంటూ ప్రశ్నించాడు. అప్రమత్తమైన కాంగ్రెస్ శ్రేణులు వృద్ధుడిని నిలువరించే ప్ర యత్నం చేశారు. పింఛన్ పెంపుపై అడగటంలో తప్పులేదని, పెంచుతాం అన్నది వాస్తవమేనని ఎమ్మెల్యే ఒప్పుకొన్నారు. ఆర్థిక వెసులుబాటు లేకపోయిందని, పింఛన్ల దరఖాస్తులను ఆన్లైన్లో తీసుకుంటున్నామని, త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు. పింఛన్ల పెంపు అమలుచేయాలని వృద్ధుడు కోరుతుండగానే కాంగ్రెస్ నాయకులు అతడిని దబాయించడం గమనార్హం.