జోగుళాంబ గద్వాల : పింఛన్ పెంచి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఊసే ఎత్తడం లేదని పండుటాకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని(Aiza town) పాత బస్టాండ్ సమీపంలో గద్వాల రహదారిపై రాస్తారోకో(Elderly dharna) చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ.. రేవంత్ సర్కారు వచ్చాక నెల ముగుస్తున్నా పింఛన్ (Aasara pensions) డబ్బులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.2 వేలు ఉన్న పింఛన్‌ను రూ.4 వేలు, రూ.4 వేలు ఉన్న దివ్యాంగులకు పింఛన్ రూ.6 వేలు అందిస్తామని ప్రకటించిన తర్వాత రేవంత్ సీఎం అయి ఏడు నెలలు కావస్తున్నా ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో నెలనెలా మొదటి వారంలోనే పింఛన్లు చేతికి అందేవని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి డబుల్ చేస్తామన్న పింఛన్ల సంగతి దేవుడెరుగు పాతవి కూడా సమయానికి అందించడం లేదన్నారు. వీరికి బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ధర్నాతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై విజయ భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకొని వారితో మాట్లాడి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.