సుల్తాన్‌బజార్, మే 7: ఉద్యోగులకు గచ్చిబౌలి హౌజింగ్ సొసైటీలో ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడుతానని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ హామీ ఇచ్చారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవోస్ గచ్చిబౌలి హౌజింగ్ సొసైటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎన్జీవో కేంద్ర సంఘం నేతృత్వంలో ఉద్యోగ జేఏసీ ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని కొనియాడారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దుకు పార్లమెంటులో బిల్లు పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు ఎం రాజేందర్, సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రతాప్, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ, టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ క్రిష్ణాయాదవ్, భాగ్యనగర్ టీఎన్జీవో గచ్చిబౌలి హౌజింగ్ సొసైటీ నాయకులు పాల్గొన్నారు.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఈసీ క్లీన్చిట్
ఎన్నికల అఫిడవిట్ ట్యాపరింగ్ కేసులో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్చిట్ ఇచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి శ్రీనివాస్‌గౌడ్ సహా 25 మంది అభ్యర్థులు 51 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ, తిరస్కరణ అనంతరం 14 మంది పోటీలో మిగిలారు. అయితే, శ్రీనివాస్‌గౌడ్ అఫిడవిట్‌ను ట్యాంపరింగ్ చేశారంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరికొందరు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. గత డిసెంబర్ 15న ఢిల్లీ హైకోర్టు ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. తాజాగా ఈసీ ఎటువంటి ట్యాంపరింగ్ జరగలేదని స్పష్టం చేసింది.