హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో తప్పు చేస్తే తప్పించుకోలేమనే భయం నేరస్థుల్లో కలుగుతున్నది. ఇందుకు శిక్షల శాతం పెరుగుదలే నిదర్శనం. పోలీసుల పక్కా దర్యాప్తు, సాంకేతికత, ఇతర ఆధారాల సేకరణతో కోర్టులో రికార్డు సమయంలోనే శిక్షలు ఖరారవుతున్నాయి. సంచలన కేసుల్లోనూ నిందితులు తప్పించుకోకుండా సాంకేతికంగా కూడా పక్కాగా ఆధారాలు కోర్టుకు సమర్పిస్తుండటంతో మరణశిక్షలు సైతం పడుతున్నాయి. పోలీసుల పక్కా దర్యాప్తు, ఆధారాల సేకరణ, కేసు ట్రయల్స్ ఫాలోఅప్, కోర్టులో కేసు నిరూపితం అయ్యేలా తీసుకొంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలిస్తున్నాయి. గత ఏడాదిలో శిక్షలు 50.03 శాతానికి చేరినట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి టీఎస్పోలీస్ వార్షిక నివేదిక 2021లో వెల్లడించారు. ఏటేటా కన్విక్షన్రేటులో పెరుగుదల వెనుక పోలీస్‌శాఖ భారీ కసరత్తే ఉన్నది. సిబ్బంది పని విభజన ద్వారా వారిలో మరింత జవాబుదారీతనం పెంచవచ్చన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా డీజీపీ ఫంక్షనల్ వర్టికల్స్ విధానాన్ని తీసుకొచ్చారు. పోలీసుల రోజువారీ విధులను ప్రధానంగా 17 వర్టికల్స్‌గా విభజించారు. ఇందులో కోర్టు విధులు, కోర్టు కేసుల ఫాలోఅప్‌కు సంబంధించి ప్రతి స్టేషన్లో కోర్ట్ ఫంక్షనల్ వర్టికల్ సిబ్బందిని నియమించారు. వారికి డివిజన్, జిల్లా, రాష్ర్టస్థాయిలో శిక్షణ శిబిరాలు పెట్టారు. ప్రతి కేసులో పబ్లిక్ ప్రాక్యూటర్లతో సమన్వయం చేసుకొంటూ ముందుకు వెళ్లడం వల్ల నేరస్థులకు శిక్షలు ఖరారవుతున్నాయి.
నిరంతర ఫాలోఅప్‌తో పెరుగుతున్న పనితీరు
కోర్టు ఫంక్షనల్ వర్టికల్ సిబ్బందికి కోర్టు డ్యూటీలు ఇవ్వడంతో వారిలో వృత్తినిపుణత పెరుగుతున్నది.
కోర్టు విధులకు సంబంధించి ప్రత్యేకంగా ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్) రూపొందించారు.
రాష్ట్రస్థాయిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా సాఫ్ట్‌స్కిల్స్, లీగల్ ప్రోసీజర్స్‌పై అవగాహన పెంచుతున్నారు.
ఏ కేసులో అయినా తొలిరోజు విచారణకు తప్పకుండా ఆ ఎస్‌హెచ్‌వో, కేసు తీవ్రతను బట్టి యూనిట్ ఆఫీసర్ హాజరవుతున్నారు. ఫలితంగా బాధితుల్లో, సాక్షుల్లో భరోసా పెరుగుతున్నది.
కోర్టు విధులు నిర్వర్తించే సిబ్బంది పని తీరును కేపీఐ (కీ ఫెర్మామెన్స్ ఇండికేటర్స్) ద్వారా లెక్కగట్టడం. ఉత్తమంగా పనిచేసేవారికి డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయిలో అవార్డులు ఇస్తుండటంతో సిబ్బంది మధ్య ప్రోత్సాహకరమైన పని వాతావరణం ఏర్పడుతున్నది.
ఏదైనా కేసులో నిందితులకు శిక్షపడితే ఆ కేసు ఫాలోఅప్ చేసిన కోర్టు డ్యూటీ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆయా యూనిట్ల అధికారులు సన్మానించి ప్రోత్సహిస్తున్నారు.
సంచలన కేసుల్లో రికార్డు టైంలో తీర్పులు
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట వద్ద 2020 మే 20న ఓ ఉన్మాది తొమ్మిది మందిని బావిలో వేసి హత్యచేసిన కేసులో ఐదు నెలల్లోనే పోలీసులు ద ర్యాప్తు పూర్తచేశారు. కోర్టు మరణశిక్ష విధించింది.
హనుమకొండలో 2019 జూన్ 18న అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరు బయట తల్లిపక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి గొంతు కోసిన నిందితుడిపై వరంగల్ పోలీసులు 20 రోజుల్లోనే అభియోగపత్రాలు దాఖలు చేశారు. 48 రోజుల్లోనే విచారణ పూర్తయి నిందితుడు ప్రవీణ్‌కు మరణశిక్ష పడింది.
2019 నవంబర్‌లో ఆసిఫాబాద్ జిల్లా ఎల్లాపటార్ గ్రామ శివారులో ఓ వివాహితపై సామూహిక అత్యాచారం చేసి గొంతుకోసి చంపిన ముగ్గురు నిందితులపై పోలీసులు 19 రోజుల్లోనే పకడ్బందీ దర్యాప్తు తో చార్జిషీటు కోర్టుకు సమర్పించారు. 66 రోజుల్లోనే ముగ్గురికి మరణశిక్ష ఖరారైంది.
యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో ముగ్గురు విద్యార్థినులపై లైంగికదాడి చేసిన శ్రీనివాస్‌రెడ్డి కేసులో 42 రోజుల్లోనే విచారణ పూర్తయి మరణశిక్ష పడింది.