హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : కేంద్ర విద్యుత్తు శాఖకు చెందిన ప్రభుత్వరంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్)కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 2023-24 సంవత్సరానికి భారత పరిశ్రమ సమాఖ్య(సీఐఐ) అందించే ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును దక్కించుకుంది. సీఐఐ రజతోత్సవం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సెక్రటరీ మిలింద్ దియోరా చేతులమీదుగా ఈఈఎస్ఎల్ సీజీఎం అనిమేశ్ మిశ్రా పురస్కారాన్ని అందుకున్నారు. ఉజాలా పథకం కింద 36 కోట్ల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేయడమే కాకుండా, 1.3 కోట్ల వీధి దీపాలను అమర్చింది. కార్యక్రమంలో సీఐఐ తెలంగాణ చైర్మన్ సాయిదేవరాజులు ప్రసాద్, ఇంధన సామర్థ్య కౌన్సిల్ చైర్మన్ రవిచంద్రన్, సీఐఐ ఈడీ కేఎస్ వెంకటగిరి, గిరిజాశంకర్, పీవీ కిరణ్, అనంత్ పాల్గొన్నారు.