హైదరాబాద్: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆయనను నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు.
1936, నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. చిననాటినుంచే విలక్షణ, సృజనాత్మకత కలిగిన ఆయన.. ఈనాడు దినపత్రికను ప్రారంభించి సంచలనం సృష్టించారు. 1974, ఆగస్టు 10న విశాఖపట్టణంలో ఈనాడును ప్రారంభించారు. అనంతరం సితార సినీ పత్రిక, ఈటీవీ చానళ్లను కూడా తీసుకొచ్చి మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫిల్మ్ సిటీని నిర్మించారు. సినిమా మొత్తాన్ని అక్కడే షూటింగ్ చేసుకునేలా సకల వసతులు కల్పించారు.