ఖైరతాబాద్, మార్చి 15 : గ్రూప్ పరీక్షల్లో అన్ని అవకతవకలే జరిగాయని విద్యావేత్త ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు. మార్చి 10న వచ్చిన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ఒక సామాన్య పౌరుడికి చూపించినా తప్పులు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల ఏండ్ల తరబడి పరీక్షల కోసం సన్నద్ధవుతున్న నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని వాపోయారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ప్రసన్న హరికృష్ణ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం తీసుకువచ్చిన జీవో నంబర్-55ను ప్రస్తుత ప్రభుత్వం తొలగించి, జీవో నంబర్-29ని తీసుకువచ్చి ఏం ఒరగబెట్టిందని నిలదీశారు. యూపీఎస్సీ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న గ్రూప్-1 నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. గ్రూప్ 2, 3లో జీఆర్‌ఎల్‌ను స్పష్టంగా ప్రకటించిన ప్రభుత్వం, గ్రూప్-1లో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. జీఆర్ఎల్ ఇచ్చి పబ్లిక్ డొమైన్లో పెడితే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తేటతెల్లమయ్యేదని స్పష్టంచేశారు. దీని వెనుక కుట్ర జరిగినట్టు తెలుస్తున్నదని ఆరోపించారు.
గూగుల్ ట్రాన్స్లేట్గా తెలుగు మీడియం బ్లూ ప్రింట్
గత నోటిఫికేషన్‌లోని పాత ప్రశ్నపత్రాలనే అక్టోబర్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఇచ్చారని నిరుద్యోగులు చెబుతున్నారని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. గ్రూప్-1 మెయిన్స్ ప్రశ్నపత్రాలను ఎవరితో దిద్దించారన్న విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాలని కోరారు. పేపర్లు దిద్దే వ్యక్తుల అర్హతలు, బ్యాక్‌గ్రౌండ్ ఏమిటనేది బహిర్గతం చేయాలని పేర్కొన్నారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో దిద్దించామని చెబుతున్న ప్రభుత్వం వారికిచ్చిన బ్లూ ప్రింట్లో ఎంత మేరకు శాస్త్రీయత ఉందో వివరించాలని తెలిపారు. తెలుగు మీడియం విద్యార్థుల కోసం తయారు చేసిన బ్లూ ప్రింట్ గూగుల్‌లో ట్రాన్స్‌లేట్ చేసినదిగా తెలిసిందని చెప్పారు. ఆంధ్రాకు చెందిన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పేపర్లు దిద్దించారని ఆరోపించారు. తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 20,100 ప్రశ్నపత్రాలను మూడు నెలల సమయం తీసుకొని రీకౌంటింగ్ కాకుండా రివల్యుయేషన్ చేయాలని, నిష్ణాతులైన ప్రొఫెసర్లతో దిద్దించాలని డిమాండ్ చేశారు.
సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి
విద్యావేత్త అశోక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో టాప్ 500లో 37 శాతం మంది ఓసీ అభ్యర్థులు ఎంపికయ్యారని, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు లేరని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందులో కుట్ర జరిగిందని తెలిపారు. అలాగే 200కుపైగా ఉద్యోగాలు అమ్ముకున్నారని, ఇందులో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ విఠల్ మాట్లాడుతూ గ్రూప్స్‌లో జరిగిన అవకతవకలపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.