హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పీఈటీ పోస్టుల అప్‌గ్రెడేషన్‌లో కీలక ముందడుగు పడింది. పీఈటీలు పీడీలుగా పదోన్నతులు పొందేందుకు మార్గం సుగమమైంది. ఇన్నేండ్లు అడ్డంకిగా ఉన్న కోర్టు కేసు ఉపసంహరణకు సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) ముందుకొచ్చారు. ఎమ్మెల్సీలు కూర రఘెత్తంరెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు చొరవతో సోమవారం మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో కేసు వాపస్ తీసుకుంటామని ఎస్జీటీలు అంగీకరించారు. దీంతో పీఈటీ పదోన్నతుల ప్రక్రియ వచ్చేనెలలో మొదలు కానున్నది. రాష్ట్రంలో అర్హులైన 1,849 మంది పీఈటీలను ఫిజికల్ డైరెక్టర్లుగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో అప్‌గ్రేడ్ చేసింది. ఈ మేరకు జీవోలు 15, 17, 18 జారీచేసింది. ఈ జీవోలను వ్యతిరేకిస్తూ ఎస్జీటీలు కోర్టును ఆశ్రయించారు.
బీపీఈడీ అర్హత కలిగిన ఎస్జీటీలకు, పీఈటీలతో సమానంగా ఫిజికల్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని కోర్టుకు విన్నవించారు. పీఈటీలకు మాత్రమే పదోన్నతులు ఇస్తే తాము నష్టపోతామని వాదించారు. దీంతో అప్‌గ్రెడేషన్ ప్రక్రియ పెండింగ్‌లో పడింది. ఈ నేపథ్యంలో పీఆర్టీయూ తెలంగాణ నేతలు చొరవ తీసుకొన్నారు. కామన్ సీనియార్టీతో బీపీఈడీ అర్హులకు ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీడీ) పదోన్నతులు కల్పిస్తే కోర్టు కేసును ఉపసంహరించుకొంటామని ఎస్జీటీ సంఘం నేతలు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం, పీఈటీలు అంగీకరించడంతో సమస్య కొలిక్కి వచ్చింది. కోర్టు కేసు ఉపసంహరించుకోగానే పదోన్నతుల ప్రక్రియ మొదలు కానున్నది. జూన్ మొదటి వారంలో పదోన్నతుల షెడ్యూల్ విడుదలవుతుందని సంఘాల నేతలు తెలిపారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ, ఎస్జీటీ సంఘాల నేతలు మంత్రి సబిత అభినందించారు.
లక్ష దాటిన ఎంసెట్ దరఖాస్తులు
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఎంసెట్‌కు లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి. సోమవారం సాయంత్రం వరకు 1,00,992 దరఖాస్తులు వచ్చినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ వెల్లడించారు. ఇంజినీరింగ్‌కు 64,104, అగ్రికల్చర్, మెడికల్ విభాగానికి 36,888 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు.