హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ) : ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యలోనే ఉందని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వైస్ చాన్స్‌లర్ కృష్ణదేవరావ్ అన్నారు. శనివారం ఏపీలోని గుంటూరు జిల్లా చేబ్రోలులోని వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఆన్లైన్ లెర్నింగ్, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్‌లో ఎంసీఏ, ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ 2వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. విదార్థులు నేర్చుకున్న విజ్ఞానాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలని సూచించారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, వర్సిటీ వీసీ నాగభూషణ్, రిజిస్ట్రార్ రఘునాథన్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీల్లోకి ఓఆర్ఆర్ గ్రామాలు ; విలీనానికి గెజిట్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు మార్గం సుగమమైంది. ఈ విలీనానికి సంబంధించిన ఆర్డినెన్స్‌పై ప్రభుత్వ వాదనలను హైకోర్టు ఆమోదించింది. విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ పలు గ్రామాల ప్రజలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ప్రభుత్వ ఆర్డినెన్స్ ప్రకారమే విలీన ప్రక్రియ సాగుతుందని చీఫ్ జస్టిస్ ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు గెజిట్ విడుదల చేసింది.