హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగాల భర్తీలో మళ్లీ ఇంటర్వ్యూలు ప్రవేశపెట్టబోతున్నారా? కీలక పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని అనుసరించనున్నారా? అంటే ‘అవును’ అనే సంకేతాలే వెలువడుతున్నాయి. మళ్లీ ఇంటర్వ్యూలను చేర్చేందుకు సర్కార్ ప్రయత్నిస్తున్నది. విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (ఈవో), డైట్ లెక్చరర్ వంటి పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూలను చేర్చే అంశంపై ప్రభుత్వ శాఖల మధ్య సంప్రదింపులు జరిగాయి. విద్యాశాఖ పరిధిలో 140 పోస్టుల భర్తీకి ఆ శాఖ టీజీపీఎస్సీకి ప్రతిపాదనలు పంపింది. వీటిలో 24 డిప్యూటీ ఈవో పోస్టులున్నాయి. డైట్ లెక్చరర్, ఎస్సీఈఆర్టీ లెక్చరర్, బీఈడీ కాలేజీ లెక్చరర్ పోస్టులు 116 ఉన్నాయి. ఇవిగాక మరో 8 లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులున్నాయి. కాగా వీటిలో డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యూ విధానం ఉన్నదా? లేదా? అని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టత కోరారు. అయితే ఇంటర్వ్యూల్లేవని విద్యాశాఖ అధికారులు స్పష్టతనిచ్చారు. దీంతో టీజీపీఎస్సీ అధికారులు సంతృప్తి చెందలేదని తెలిసింది. జీఏడీ నుంచి స్పష్టతకోరినట్టు సమాచారం. ఇంటర్వ్యూలను పునరుద్ధరించే అంశంపైనా చర్చోపచర్చలు జరిగాయని, మళ్లీ ఇంటర్వ్యూ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారన్న చర్చ నడుస్తున్నది. గ్రూప్ -1, 2, జేఎల్ వంటి పోస్టుల భర్తీలోనూ ఇంటర్వ్యూలను పునరుద్ధరిస్తారన్న ప్రచారం కూడా జరుగుతున్నది.
ఇంటర్వ్యూలు రద్దుచేసిన కేసీఆర్
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూ విధానమంటేనే అన్యాయం, అసమానతలకు కేరాఫ్ అడ్రస్. రాత పరీక్షలో ఎక్కువ మార్కులొచ్చినా ఇంటర్వ్యూల్లో తక్కువ మార్కులేసిన ఉదంతాలెన్నో ఉన్నాయి. ఈ కారణంతో ఉద్యోగం చేజార్చుకున్న వారు కొందరైతే, కీలకపోస్టులు దక్కాల్సిన వారు.. నామమాత్రపు పోస్టుల్లోకి నెట్టివేతకు గురైనవారు కోకొల్లలుగా ఉన్నారు. ఉమ్మడి ఏపీలో గ్రూప్ -1 ఇంటర్వ్యూలతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఆంధ్రా ప్రాంతం వారికి లాభం చేకూర్చి.. తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేశారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఇలాంటి వివాదాస్పద ఇంటర్వ్యూ విధానాన్ని గత కేసీఆర్ సర్కార్ ఎత్తివేసింది. అన్యాయం, అసమానతలకు చరమగీతం పాడింది. గ్రూప్-1, 2, జేఎల్, డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను పూర్తిగా రద్దుచేసింది. పైరవీలు, పక్షపాతానికి తావులేకుండా, కేవలం ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాల భర్తీకి అవకాశం కల్పించింది. గతంలో జరిగిన అన్యాయాలకు పూర్తిగా పుల్‌స్టాప్ పెట్టింది. ఇంటర్వ్యూల రద్దుతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. కష్టపడి చదివితే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం వారిలో పెరిగింది. మొన్నటికి మొన్న గ్రూప్ -1, 2, జేఎల్ ఉద్యోగాలకు ఎంపికైనవారు ఇంటర్వ్యూల్లేకుండానే కొలువులను సొంతం చేసుకున్నారు. మళ్లీ ఇంటర్వ్యూలు ప్రవేశపెట్టబోతున్నారన్న వార్తలతో నిరుద్యోగుల్లో కలవరం మొదలైంది.
మరింత ఆలస్యం
ఒక ఎగ్జామ్ ఉన్న పరీక్షలను మూడు నెలల్లోపు, మల్టిపుల్ ఎగ్జామ్స్ గల నియామకాలను ఆరు నెలల్లోపు పూర్తిచేస్తామని టీజీపీఎస్సీ ఇటీవలే ప్రకటించింది. గ్రూప్ -1, 2, డిప్యూటీ ఈవో, జేఎల్ పోస్టులు మల్టిపుల్ ఎగ్జామ్స్ గలవే. ఇంటర్వ్యూ విధానంతో ఈ పోస్టుల భర్తీ ఆలస్యమవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఒకో ఇంటర్వ్యూకు సగటున 30 నిమిషాలు పడుతుంది. ఈ లెకన గ్రూప్ -1 క్యాటగిరీలో 200 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో 600 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది. రోజుకు 25 మందిని ఇంటర్వ్యూ చేసినా తకువలో తకువ నెల రోజులు పడుతుంది. ఇక గ్రూప్-2 క్యాటగిరీలో ఎకువ సంఖ్యలో పోస్టులు ఉండటం వల్ల వేలాదిమందిని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. ఫలితంగా నియామక ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.