బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 16:50:27

గిరిజనులకు కరోనాపై అవగాహన కల్పించండి : మంత్రి సత్యవతి రాథోడ్

గిరిజనులకు కరోనాపై అవగాహన కల్పించండి : మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్  :  గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి కరోనా వైరస్ రాకుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని, కోవిడ్- 19 వ్యాధి లక్షణాల పట్ల అవగాహన కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల విద్యాలయాల అధికారులు, ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలిచ్చారు.  నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో కరోనాపై మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. గురుకుల పాఠశాలల్లో, ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు తప్ప మిగిలిన వారికి సెలవులిచ్చినందున, ఎక్కువ మంది విద్యార్థులను ఒకే గదిలో ఉంచకుండా, ఎక్కువ గదుల్లో తక్కువ మంది ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన విద్యా సంస్థల్లో విద్యార్థులకు కరోనా వైరస్ పట్ల పూర్తి అవగాహన కల్పించాలన్నారు.  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, వ్యక్తిగత పరిశుభ్రత పై ఎక్కువ శ్రద్ధ పెట్టేలా చూడాలన్నారు.

ఐటీడీఏలంటే గిరిజన సమగ్ర వికాస కేంద్రాలుగా బాసిల్లే విధంగా కొత్తగా వచ్చిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు అంకిత భావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. అట్టడుగున ఉండి, అడవుల్లో ఉన్నగిరిజనులకు సేవ చేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గిరిజనుల మన్ననలు పొందేలా పనిచేయాలన్నారు. గిరిజనులకు ఉపయోగపడే కుటీర పరిశ్రమలు స్థాపనకు కృషి చేయాలన్నారు. గుడుంబా బాధిత కుటుంబాలకు, వితంతువులకు ఆసరా కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. వాటన్నింటిని లబ్దిదారులకు చేర్చి ప్రభుత్వం వారికోసం చేస్తున్న కృషి అర్ధమయ్యేలా ప్రాజెక్టు అధికారుల పనితీరు ఉండాలన్నారు. గిరిజనుల కోసం ఇంకా ఎలాంటి పథకాలు, పనులు చేస్తే వారి వికాసానికి ఉపయోగపడుతాయో కూడా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులుగా ఆలోచించి ప్రణాళికలు రూపొందించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లోని నిరక్షరాస్యత నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ గారు చెప్పిన ఈచ్ వన్ టీచ్ వన్ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా జడ్ చోంగ్తు, ఉట్నూరు ఐటీడీఏ పి.ఓ భవేష్ మిశ్రా, భద్రాచాలం ఐటీడీఏ పి.ఓ గౌతమ్, ఏటూరు నాగారం ఐటీడీఏ పి.ఓ హన్మంతు, మన్ననూరు ఐటీడీఏ పి.ఓ అఖిలేశ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ మురళికృష్ణ, ట్రైకార్ డిజిఎం శంకర్ రావు, జాయింట్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్లు విజయలక్ష్మి, నరోత్తమ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


logo
>>>>>>