హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రాప్రాంతానికి చెందిన వ్యక్తిని నియమించడం కాంగ్రెస్లో నిప్పురాజేసింది. ఆంధ్రా వలసవాదులు వద్దు.. తెలంగాణ విద్యార్థులు ముద్దు.. మా పదవులు మాకే కావాలి అంటూ కాంగ్రెస్ శ్రేణులు అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించాయి. రాష్ట్ర ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా ఈ నెల 13న ఏపీకి చెందిన యడవల్లి వెంకటస్వామిని ఏఐసీసీ నియమించింది.
దీనిపై తెలంగాణ విద్యార్థి నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేఖాస్ర్తాన్ని సంధించారు. వెంకటస్వామిని తొలగించాలని, తెలంగాణ వ్యక్తికే అధ్యక్షపదవిని కట్టబెట్టాలని డిమండ్ చేశారు. 1200 మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా మళ్లీ ఆంధ్రా వలసవాదిని నియమించడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమే’ అని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.