హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ)/సిటీబ్యూరో : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణతోపాటు ఆయన సోదరుడు నవీన్‌కుమార్ ఇండ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. రాజేంద్రనగర్‌తోపాటు చైతన్యనగర్లోని వీరి నివాసాల్లో సోదాలు జరిపారు. ఏసీబీ నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నది. శివబాలకృష్ణ రూ.250 కోట్ల మేర ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు గత సోదాల్లోనే ఏసీబీ గుర్తించింది. 200 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు ఇంటి స్థలాలు, విల్లా తదితర ఆస్తులు ఉన్నట్టు తేల్చింది. ఇప్పటికే శివబాలకృష్ణ, అతని సోదరుడు నవీన్‌తోపాటు బినామీలుగా వ్యవహరించిన వారి సమీప బంధువులు ముగ్గురిని ఏసీబీ అరెస్టు చేయగా, ఇటీవల వారు బెయిల్‌పై విడుదలయ్యారు. తాజా దాడుల్లో ఈడీ పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నది.