Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు తెలంగాణ నుంచి భారీగా నిధులు వెళ్తున్నాయా..? హవాలా మార్గంలో కొన్ని రాష్ట్రాలకు హైదరాబాద్ నుంచి నిధులు తరలించారా? అంటే ఔననే అంటున్నాయి ఈడీ వర్గాలు. త్వరలో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి నిధులు తరలిస్తున్నారన్న ఆరోపణలు మరోసారి వినిపిస్తున్నాయి. ఇటీవలే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి నిధులు తరలించినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఢిల్లీలోని అధిష్ఠానానికి రాష్ర్టానికి చెందిన కాంగ్రెస్ ప్రముఖుడు ఒకరు రూ.650 కోట్ల నిధులను సమకూర్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఏ రూపంలో నిధులు మళ్లాయన్నదానిపై ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు.
మహారాష్ట్ర మీదుగా ఢిల్లీకి నిధులు వెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలోని ఓ కీలక నేత కేంద్రంగానే ఇది సాగినట్టు అనుమానాలు బలపడుతున్నాయి. నెలన్నర నుంచి నిధుల తరలింపు జరుగుతున్నది. దీంట్లో కొందరు బడా హవాలా వ్యాపారులు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తున్నది. కొన్ని నిధులు హర్యానాకు కూడా చేర్చినట్టు చెప్తున్నారు. దీనిని ఢిల్లీలోని అధిష్ఠానం పెద్ద ఒకరు నేరుగా పర్యవేక్షించినట్టు చెప్తున్నారు. రాష్ట్రంలోని అనేకమంది అనుమానితులపై ఈడీ అధికారులు నిఘా పెట్టారు. వారి లావాదేవీలను తనిఖీ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తం ఒకేసారి హవాలా రూపంలో చేతులు మారలేదని రాష్ట్రంలోని ఓ అధికారి వ్యాఖ్యానించారు. నెలన్నర క్రితమే ఈ తంతంగం పూర్తయిందని చెప్తున్నారు. అయితే, ఒక కేసు విచారణపై మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తిని విచారించగా ఢిల్లీ, తెలంగాణ లింకు బయటకు వచ్చిందని చెప్తున్నారు.
రాష్ర్టానికి చెందిన కాంగ్రెస్ ప్రముఖుడు అధిష్ఠానానికి ఎక్కడి నుంచి నిధులు సమకూర్చారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల రాష్ట్రంలో పలు పనులను, కాంట్రాక్టులను ఫైనల్ చేసిన విషయం తెల్సిందే. వీటిపై బహిరంగంగానే అవినీతి ఆరోపణలున్నాయి. వీటితోపాటు ప్రపంచ బ్యాంకు పేరుతో కొన్ని పనులు చేపట్టనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ పనులకు సంబంధించి పలువురు ‘విరాళాలు’ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇక హైడ్రా పేరుతో జరుగుతున్న కూల్చివేతల వెనుక కూడా వసూళ్లు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి.
వీటి నుంచే సమకూర్చి ఉంటారని చెప్తున్నారు. అధికార పార్టీలోని ఒక వర్గం పార్టీకి సంబంధించిన నిధుల వేట కొనసాగిస్తున్నది. దీనిపై పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఒక వర్గమే నిధుల సమీకరణ చేస్తున్నదని, దీంతో పనుల్లో, పదవుల్లో వాళ్లకే ప్రాధాన్యం లభిస్తున్నదని కూడా చెప్తున్నారు. తాజాగా జరిగిన ఈడీ దాడులకు కూడా కాంగ్రెస్ పార్టీలోని వర్గపోరే కారణమని చెప్తున్నారు. విషయం తెల్సిన పెద్ద మనుషుల పాత్ర కూడా దీని వెనుక లేకపోలేదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.