పంటకు ఎరువు వేస్తే దిగుబడి అధికంగా వస్తుంది. అందుకే డీపీఏ, సూపర్ ఫాస్పేట్ వంటి ఎరువులు విస్తారంగా వాడుతుంటారు. కానీ.. డీపీఏ, కాంప్లెక్స్ ఎరువుల దిగుమతులు తగ్గిపోవడంతోపాటు.. వాటి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా అవతరిస్తున్నది.. ఫాస్పేట్ రిచ్ ఆర్గానిక్ మాన్యుర్.. ప్రోమ్!!
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): పశువుల ఎరువు లేదా వరిగడ్డి లేదా ప్రెస్మడ్ లేదా ఏదైనా ఆయిల్ కేకులకు హైగ్రేడ్ రాక్ ఫాస్ఫేట్ను కలిపి ప్రోమ్ను తయారుచేస్తున్నారు. ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వాటి కొరతను ఫాస్ఫేట్ అధికంగా ఉండే ఈ సేంద్రియ ఎరువు తీరుస్తుందని వ్యవసాయాధికారులు చెప్తున్నారు. ఈ సేంద్రియ ఎరువును కేంద్ర రసాయన ఎరువుల మంత్రిత్వశాఖ 2012లోనే ఎఫ్సీవో (ఫెర్టిలైజర్స్ కంట్రోల్ ఆర్డర్)-1995లో చేర్చింది. దీనిని ఇఫ్కో, క్రిబ్కో లాంటి ప్రముఖ సంస్థలు తయారుచేస్తున్నాయి. ఇందులో నత్రజని1.5% భాస్వరం 10.4%, ఆర్గానిక్ కార్బన్ 10-12% చొప్పున ఉంటాయి. ఒక 50 కిలోల ప్రోమ్ బస్తాలో 5 కిలోల భాస్వరం నీళ్లలో కరిగే రూపంలో ఉంటుంది. ఇది గుళికల రూపంలో 32% వరకు ఉంటుంది.
ఏ పంటలకు అనుకూలం?
ప్రోమ్ ఎరువు భూమిలోని క్షారత్వాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందని, అన్ని పంటలకు ఇది అనుకూలమైదని వ్యవసాయాధికారులు చెప్తున్నారు. మొక వేర్ల వృద్ధికి దోహదపడే ఈ ఎరువును దుకిలో మొదటి దఫా ఎరువుగా వాడుకోవచ్చు. ఒక ఎకరాకు 100-200 కిలోల వరకు వాడాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. దీనిని వాడటం వల్ల వరి దిగుబడి 29% పెరిగినట్టు ప్రయోగాలు తెలియచేస్తున్నాయి. ముఖ్యంగా పత్తి, మిరప లాంటి పంటలకు అద్భుతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. దీనిని ఉపయోగించడం వల్ల భాస్వరంతోపాటు నత్రజని, సూక్ష్మ పోషకాలైన జింక్, కాపర్, కోబాల్ట్ లాంటి పోషక పదార్థాలు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్తున్నారు. ప్రతి యేటా ప్రోమ్ ఎరువును వాడటం వల్ల పంటల దిగుబడి, నాణ్యత పెరుగుతాయని అంటున్నారు.
ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ పొటాష్ రిచ్
స్పిక్ కంపెనీ తయారు చేసే పొటాష్ రిచ్ ఆర్గానిక్ ఎరువు కూడా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ అని ఉత్పత్తిదారులు చెప్తున్నారు. దీనిని చెరుకు పిప్పి నుంచి తయారుచేస్తారు. షుగర్ ఫ్యాక్టరీలో పంచదార తయారయ్యాక మిగిలిన పిప్పి నుంచి మోలాసిస్ వస్తుంది. ఈ మొలాసిస్ నుంచి తయారైనదే స్పిక్ పొటాష్. ఇందులో 14.5 శాతం పొటాషియం ఉంటుంది. ఈ ఎరువు భూమి భౌతికస్థితిని మెరుగుపరుస్తుంది. భూమికి గాలిని నిలుపుకొనే శక్తిని, నీటి నిల్వ శక్తిని పెంచడమే కాకుండా మొకకు పొటాషియంను కూడా అందిస్తుంది. ఈ పొటాషియం భూమిలో ఎకువ కాలం ఉండి మొకల పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుంది. రైతులు పండించే అన్ని పంటలకు మురేటే ఆఫ్ పొటాష్ (మోప్)కు బదులుగా దీనిని వాడుకోవచ్చని సిఫారసు చేస్తున్నారు.
రైతులకు మేలు చేసే ఎరువులు
రైతులు ప్రోమ్ ఎరువును ఒక ఎకరానికి 100 నుంచి 200 కిలోలు పంటను బట్టి వేసుకోవాలి. పొటాషియం ఆర్గానిక్ రూపంలో ఉండటం వల్ల భూమికి గానీ వాతావరణానికి గానీ ఎలాంటి హాని కలుగదు. ఎరువును రైతులు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఈ ఎరువులను ఏండ్ల తరబడి వాడినా భూమికి ఎలాంటి నష్టం వాటిల్లదు.
– విజయభాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి, జయశంకర్ భూపాలపల్లి