Janasena | హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కలిసి బరిలోకి దిగాలని భావిస్తున్న పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాకిచ్చింది. జనసేన తన పార్టీ గుర్తుగా ప్రచారం చేసుకున్న గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దీంతో ఇప్పుడా గుర్తు తమకు దక్కుతుందో, లేదోనన్న ఆందోళన ఆ పార్టీలో నెలకొన్నది.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏదైనా రాజకీయ పార్టీ తన గుర్తును నిలుపుకోవాలంటే ఎన్నికల్లో నిర్ణీత ఓట్ల శాతాన్ని పొందవలసి ఉంటుంది. జనసేన కొన్ని ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అతి తక్కువ స్థానాల్లో మాత్రమే పోటీ చేయడం వంటి కారణాల వల్లే పార్టీ సింబల్‌ను కోల్పోవాల్సి వచ్చిందని ఈసీ స్పష్టం చేసింది. గతంలో ఏపీలోని బద్వేలు ఉప ఎన్నిక, తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాసు గుర్తును ఈసీ వేరే పార్టీ అభ్యర్థులకు కేటాయించింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఆ పార్టీ తన గుర్తును కోల్పోయింది.