హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జూన్ 4 మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 33 ప్రాంతాల్లో లెక్కింపు ప్రారంభకానుండగా, ఇందుకోసం 9445 మంది సిబ్బందిని నియమించారు. 2373 టేబుళ్లు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గ స్థానాల కోసం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్‌లో 45 మంది అభ్యర్థులు పోటీ చేశారు. రాష్ట్రంలో 65.67 శాతం పోలింగ్ జరుగగా, 2.20 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా 2.08 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా, లెక్కింపునకు అధిక సమయం పట్టే అవకాశమున్నది. ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను విడివిడిగా లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు టేబుల్ వద్ద ఒక్కో అభ్యర్థికి ఒక ఏజెంట్‌ను అనుమతిస్తారు. ఫలితాలు వెలువడేందుకు పదిరోజులు మాత్రమే ఉండడంతో ప్రజలు, అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
జూన్‌లో వరుసగా ఓట్ల లెక్కింపు..
ఈ నెలలో రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు మరో రెండు చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల శాసనమండలికి ఉపఎన్నిక, లోక్‌సభ ఎన్నికలు జరుగగా, ఈ నెల 27న నల్లగొండ, వరంగల్, ఖమ్మం శాసనమండలి స్థానానికి ఉపఎన్నిక నిర్వహించనున్నారు. వీటన్నింటి ఓట్ల లెక్కింపును జూన్ మొదటివారంలో చేపట్టనున్నారు. మహబూబ్‌నగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జూన్ 2, లోక్‌సభ ఎన్నికల లెక్కింపు జూన్ 4, గ్రాడ్యుయేట్ ఉపఎన్నిక లెక్కింపు జూన్ 5న నిర్వహించనున్నారు.
మూడు నియోజకవర్గాల్లో మొదట పూర్తి..
రాష్ట్రంలో 35,809 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మొదట భద్రాచలం, అశ్వరావుపేట, చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కౌంటింగ్ పూర్తికానున్నది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చివరి లెక్కింపు పూర్తి కానున్నది. అతితక్కువగా భద్రాచలంలో 176, అశ్వరావుపేటలో 184 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం 13 రౌండ్లలో, చార్మినార్‌లో 198 కేంద్రాల్లో 14 రౌండ్లలో లెక్కింపు పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజవకర్గంలో అత్యధికంగా 622 పోలింగ్ కేంద్రాలుండగా, 23 రౌండ్లలో లెక్కింపు చేయనున్నారు.
మల్కాజిగిరిలో అత్యధిక టేబుల్స్…
మల్కాజ్గిరి లోక్‌సభ పరిధిలో అత్యధిక పోలింగ్ స్టేషన్లు ఉండటంతో కౌంటింగ్ ఆలస్యం కాకుండా అధికారులు ఎక్కువ టేబుల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో..
చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలుండగా, మూడు నియోజకవర్గాల్లో అత్యధిక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంతో అక్కడ ఎక్కువ సంఖ్యలో టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
