ఇచ్చిన మాటకు కట్టుబడతాం: మంత్రి కొప్పుల
జమ్మికుంట, సెప్టెంబర్11: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌తో ఒరిగేదేం లేదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఏడేండ్లు మంత్రిగా పనిచేసి ప్రజాసంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోని ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏంచేయగలడో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని చెప్పారు. శనివారం ఆయన జమ్మికుంటలో పర్యటించారు. 16వ వార్డులోని ప్రజల కోరిక మేరకు పోచమ్మ దేవాలయ నిర్మాణానికి రూ.10 లక్షల మంజూరు పత్రాన్ని అందజేశారు. పోచమ్మ గుడి నిర్మాణం కోసం భూదానం చేసిన హర్షవర్ధన్‌ను అభినందించారు. అనంతరం మెకానిక్, మార్బుల్ యూనియన్ల ప్రతినిధులు మంత్రిని వేర్వేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. సదరు సంఘాల కమ్యూనిటీ భవన నిర్మాణాల కోసం ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున మంజూరు చేసిన పత్రాలను ఆయా యూనియన్ నాయకులకు అందజేశారు.