హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): దేశంలోనే రెండో వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) కమ్యూనికేషన్ స్టేషన్ వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు కానున్నది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్‌ను భారత నావిళాదళం ఏర్పాటు చేయనున్నది. తమిళనాడులోని తిరునల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొదటిది. 1999 నుంచి అది నావికాదళానికి సేవలు అందిస్తున్నది. రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా గుర్తించిన వైజాగ్ తూర్పు నౌకాదళ కమాండ్.. 2010 నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నది. పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్ వచ్చినప్పటికీ భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
కమోడోర్ కార్తీక్ శంకర్, సరిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్‌దాస్ బుధవారం సీఎంను కలిశారు. ఈ సందర్భంగా వికారాబాద్ డీఎఫ్‌వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. 1174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించారు. ఇకడ నేవీ స్టేషన్‌తో పాటు ఏర్పడే టౌన్షిప్లో సూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మారెట్లు ఉంటాయి. ఈ నేవీ యూనిట్లో 600 మంది నావికాదళంతో పాటు సాధారణ పౌరులు ఉంటారు. 2,500 నుంచి 3,000 మంది ఈ టౌన్షిప్లో నివసిస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త వీఎల్ఎఫ్ సెంటర్ పూర్తి కానున్నది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు వీలుగా నావికాదళం ఈ స్టేషన్‌ను ఉపయోగిస్తుంది.