Sonam Kapoor | బాలీవుడ్ గ్లామర్ క్వీన్ సోనమ్ కపూర్ మరోసారి తల్లికాబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటుడు అనీల్ కపూర్ కూతురిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సోనమ్, తన నటనా ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను వివాహం చేసుకున్న ఆమె, 2022లో తన తొలి బిడ్డ వాయుకి జన్మనిచ్చింది. ఇప్పుడు మూడేళ్ల వయసున్న వాయు త్వరలో తన చెల్లి లేదా తమ్ముడితో ఆడుకోబోతున్నాడా? అనే ఉత్కంఠ అభిమానుల మధ్య నెలకొంది.బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, సోనమ్ ప్రస్తుతం తన సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్నారని తెలుస్తోంది.
ఈ విషయంపై సోనమ్ అహుజా దంపతుల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఇరు కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని సమాచారం. త్వరలోనే ఈ శుభవార్తను సోనమ్ సొంతగా ప్రకటించే అవకాశముంది. గతంలో తల్లికావడం గురించి మాట్లాడిన సోనమ్, “తల్లిగా మారిన తర్వాత నేను మరింత బలంగా మారాను. నా లో ఉన్న ఓపిక, సహన శక్తి మరింత పెరిగింది. మాతృత్వం నా దృష్టికోణాన్ని పూర్తిగా మార్చేసింది,” అని పేర్కొన్న సంగతి తెలిసిందే. సోనమ్ చివరిసారిగా 2023లో ‘బ్లైండ్’ అనే చిత్రంలో నటించారు. 2011లో వచ్చిన కొరియన్ థ్రిల్లర్‌కి రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘బ్యాటిల్ ఆఫ్ బిట్టోరా’ అనే ప్రాజెక్ట్ ఉంది. అనుజా చౌహాన్ రాసిన నవల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సోనమ్ మరోసారి తల్లికాబోతుందనే వార్తపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోనమ్ అభిమానులు ఈ విషయంపై ఆమె నుండి త్వరలోనే క్లారిటీ వస్తే బాగుంటుందని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.