హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ) : కంచ గచ్చిబౌలి భూముల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సృష్టించిన విధ్వంసంపై బుధవారం సుప్రీం కోర్టులో మరోసారి విచారణ జరుగనున్నది. ఇప్పటికే రెండుసార్లు జరిగిన వాదనల్లో చెట్లను నరికేసిన వంద ఎకరాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టాలని సుప్రీం కోర్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులకు జైలుశిక్ష తప్పదని హెచ్చరించింది. పునరుద్ధరణ పనులకు సంబంధించి ప్రణాళికను కోర్టుకు సమర్పించాలని సూచించింది.
దీనిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో అడవి పునరుద్ధరణ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. అసలు అక్కడ అడవే లేదని, అవి పోరంబోకు భూములని నివేదికలో పేర్కొన్నది. సుప్రీం ప్రస్తావించిన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా సొంత అఫిడవిట్‌ను ప్రభుత్వం అందజేసింది. వాదోపవాదనలు పూర్తయిన తర్వాత అఫిడవిట్‌ను స్టడీ చేసేందుకు కొంత సమయం కావాలని అమికస్ క్యూరీ కోర్టును కోరింది. అందుకు కోర్టు ఆగస్టు 13 వరకు సమయమిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నేడు మరోసారి విచారణ జరుగనున్నది.