హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : బిటుమెన్ (తారు), లైట్ డీజిల్ ఆయిల్ (ఎల్డీవో), ఇతర నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగడంపై బిల్డర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వాటి నియంత్రణకు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్యలు చేపట్టాలని మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల బిటుమెన్, ఎల్డీవో ధరలు దాదాపు రెండింతలు పెరిగాయని, దీంతో మౌలిక సదుపాయాలకు సంబంధించిన నిర్మాణ పనులపై తీవ్రమైన ప్రభావం పడుతున్నదని పేర్కొన్నారు.
గతంలో ఒక కి.మీ. డబుల్ రోడ్డు పనికి బిటుమెన్, ఎల్డీవో ఖర్చు దాదాపు రూ.35 లక్షలు అయ్యేదని, ప్రస్తుతం అది రూ.65 లక్షలకు పెరగడంతో ప్రాజెక్టుల వ్యయం గణనీయంగా పెరిగి కాంట్రాక్టర్లపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతున్నదని వివరించారు. ఈ అసాధారణ పరిస్థితుల నడుమ పనులు త్వరగా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్టర్లను ఒత్తిడి చేయొద్దని ఆయన కోరారు.