హైదరాబాద్ సిటీబ్యూరో డిసెంబరు 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో ఎవరికి దొరికినంత వాళ్లు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమైన పదవుల్లో నేతలు పెద్దమొత్తంలో కుంభకోణాలకు పాల్పడుతుంటే.. కొందరు మంత్రుల పేషీలను అడ్డాగా చేసుకుని, అరాచకశక్తులుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. పెద్ద దవాఖానలకు మందులు, వైద్యపరికరాలు సరఫరా చేసే కంపెనీలను కూడా పీడించుకుంటూ దోచుకుంటున్నట్టు సమాచారం. కమీషన్లు సమర్పించుకునే అస్మదీయులకు బిల్లులు మంజూరు చేస్తూ.. మిగతా వారిపై వివక్ష చూపుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో దవాఖానలకు మందులు, పరికరాలు సరఫరాకాక.. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఓ మంత్రికి చెందిన షాడోరాజ్.. రెచ్చిపోతున్నట్టు తెలిసింది.
నన్ను సంప్రదించకుండా ఎవరికీ చెక్కులు ఇవ్వొద్దని ఓ మంత్రికి చెందిన షాడోరాజ్ ఎంఎన్‌జే అధికారులకు హుకుం జారీచేసినట్టు సమాచారం. దవాఖానకు మందులు, సర్జికల్స్ సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్స్‌కు బిల్లులు విడుదల చేయడానికి మంత్రి షాడో పెద్దఎత్తున కమీషన్లు వసూలు చేస్తున్నాడని తెలిసింది. దవాఖానలో మందులు, సర్జికల్స్ సరఫరా చేస్తున్న వేర్వేరు డిస్ట్రిబ్యూటర్స్‌కు 9 నెలలుగా బిల్లులు విడుదల కాలేదు. బడ్జెట్ ఆర్డర్లు విడుదలైనప్పటికీ దవాఖాన అధికారుల నిర్లక్ష్యం వల్ల బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. దీంతో ఓ బడా డిస్ట్రిబ్యూటర్ ఓ మంత్రి షాడో ద్వారా తన బిల్లులు దక్కించుకునేందుకు యత్నించాడు. దీంతో షాడోరాజ్ ఎంఎన్జేలో మొత్తం ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు? వారికి ఎంత మొత్తంలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నారో వివరాలు పంపాలని దవాఖాన పరిపాలనా అధికారిని ఆదేశించారు.
ఈ మేరకు వివరాలు సేకరించిన షాడోరాజ్.. ముందుగా పెద్ద మొత్తంలో బిల్లులు ఉన్న ముగ్గురిని ఎంపిక చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం స్వయంగా షాడోరాజే ఎంఎన్‌జేకు చేరుకుని బడా డిస్ట్రిబ్యూటర్‌కు రూ.5 కోట్ల బిల్లులను సెటిల్ చేయించారు. మిగిలిన రూ.10 కోట్లలో రూ.3 కోట్లు ఒక డిస్ట్రిబ్యూటర్‌కు, రూ.2 కోట్లు మరో డిస్ట్రిబ్యూటర్‌కు బిల్లులు చెల్లించేలా చెక్కులను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చెక్కులను తాను చెప్పిన డిస్ట్రిబ్యూటర్స్‌కు మాత్రమే ఇవ్వాలని, మిగిలిన రూ.5 కోట్ల బిల్లుల గురించి తనకు చెప్పకుండా ఎవరికీ ఇవ్వొద్దని షాడోరాజ్ ఎంఎన్‌జే అధికారులకు చెప్పినట్టు తెలిసింది. పెద్ద డిస్ట్రిబ్యూటర్ల వద్ద కమీషన్లు తీసుకుని భారీ మొత్తంలో బిల్లులు మంజూరు చేస్తున్న అధికారులు.. తమను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని చిన్న డిస్ట్రిబ్యూటర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నిమ్స్‌లో పురుడు పోసుకున్న కమీషన్ల దందా ఎంఎన్‌జేకు విస్తరించింది. టీఎస్ఎంఐడీసీ, ఎంఎన్‌జే, నిమ్స్‌తో రాష్ట్ర వ్యాప్తంగా పలు దవాఖానలకు మందులు, ఇతర సర్జికల్స్ వంటివి సరఫరా చేసే ఒక బడా డిస్ట్రిబ్యూటర్ కక్కుర్తితో ఆరు నెలల క్రితం ఈ కమీషన్ల దందా నిమ్స్ దవాఖానలో పురుడు పోసుకున్నదని తెలిసింది. సాధారణంగా మూడు నెలలకు ఒకసారి బిల్లులు విడుదల చేయాలి. అవి చేతికి వచ్చేవరకు మరింత సమయం పడుతుంది. సదరు బడా డిస్ట్రిబ్యూటర్ అన్ని రోజులు నిరీక్షించలేక, బిల్లులు త్వరగా మంజూరు చేసుకోవాలనే ఉద్దేశంతో అడ్డదారులు తొక్కాడు. అతడికి ఓ మంత్రి షాడో పరిచయమైనట్టు సమాచారం. ఈ క్రమంలో తన సమస్యను వివరించగా వెంటనే స్పందించిన షాడో కమీషన్ తీసుకుని బిల్లులను విడుదల చేయించాడని తెలిసింది. అప్పటి నుంచి సదరు డిస్ట్రిబ్యూటర్ ఓ మంత్రి పేషీకి చెందిన షాడోరాజ్తో అంటకాగుతూ కమీషన్లు ఇచ్చుకుంటూ బిల్లులు పుచ్చుకోవడం అలవాటుగా మార్చుకున్నాడని సమాచారం. ఆ కమీషన్ల ఆనవాయితీని ఇతర డిస్ట్రిబ్యూటర్లపైనా బలవంతంగా రుద్దినట్లు తోటి డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటున్నారు.
డిస్ట్రిబ్యూటర్లకు బిల్లుల చెల్లింపుల కోసం నిధుల విడుదల్లో నిబంధనలు పాటించాలి. వరుస క్రమంలో, దశల వారీగా బిల్లులు చెల్లించాలి. దాదాపు అందరికీ బిల్లుల చెల్లింపులో భాగస్వామ్యం కల్పించాలి. కానీ ఎంఎన్జేలో మాత్రం కమీషన్లు సమర్పించిన డిస్ట్రిబ్యూటర్స్‌కు మాత్రమే బిల్లులు విడుదల చేస్తున్నారని మిగతా సరఫరాదారులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. విడుదలైన రూ.15 కోట్లను అన్ని డిస్ట్రిబ్యూటర్స్‌కు విడుదల చేయాల్సి ఉండగా కొందరికి మాత్రమే కేటాయించడం సమంజం కాదని మండిపడుతున్నారు. ఒక్క డిస్ట్రిబ్యూటర్‌కే రూ.5కోట్లు విడుదల చేస్తే.. మిగిలిన వారి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు.