శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6: గౌలిదొడ్డి గురుకుల విద్యార్థుల జ్ఞానం ముందు కాంగ్రెస్ సీఎం, మంత్రుల జ్ఞానం సరిపోవటం లేదని, ఆ విద్యార్థులను చూసి బుద్ధి తెచ్చుకోవాలని మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం గౌలిదొడ్డి గురుకుల విద్యాలయాన్ని బీఆర్ఎస్ తరఫున మాజీమంత్రులు జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ విప్‌లు బాల్కసుమన్, గువ్వల బాల్‌రాజ్, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సందర్శించారు. ఈ సందర్భంగా రోడ్డెక్కిన గౌలిదొడ్డి బాలుర ఐఐటీ అకాడమీ, బాలికల గురుకుల కళాశాల విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. అనాలోచిత నిర్ణయాలు తీసుకొని విద్యార్థుల జీవితాలతో చెలగాటం అడుతున్న సీఎం, మంత్రులు జ్ఞానం నేర్చుకొనేందుకు ఈ గురుకులానికి రావాలని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో దేశంలోనే టాప్-10 స్కూళ్లకు పోటీగా నిలిచిన గురుకులాలు.. నిర్వహణలోపంతో ఇప్పుడు విద్యార్థులు టీసీలు తీసుకొని వెళ్లిపోతున్నారు’ అని వెల్లడించారు.
9 నెలల్లో 37 మంది విద్యార్థులు మృతి
కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ఇటీవల జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్‌లో ఇద్దరు చిన్నారులు చనిపోయారని గుర్తుచేశారు. రాష్ట్రంలో 9 నెలల కాలంలో 37 మంది పిల్లలు గురుకుల పాఠశాలల్లో చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సీ, ఎస్టీలకు నాణ్యమైన విద్యను దూరం చేయాలని కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తున్నదని ఆర్ఎస్పీ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే పాఠశాల నుంచి వందల మంది గొప్ప వర్సిటీలకు వెళ్లారని, నేడు రోడ్డు మీదికి వచ్చి ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకుడు శ్రీనివాస్, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయిబాబా తదితరులు ఉన్నారు.