సిద్దిపేట, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు దుబ్బాక నియోజకవర్గం భగ్గుమన్నది. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే దిష్టిబొమ్మలను టీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశాయి. రఘునందన్‌రావు మాట్లాడిన తీరును దుబ్బాక ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు. దుబ్బాక ఉప ఉన్నికలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కానీ, మంత్రులపై నోటికొచ్చినట్టు మాట్లాడటమేంటని టీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడ్డారు.
బుధవారం దుబ్బాక నియోజకవర్గ కేంద్రంతోపాటు తొగుట, మిరుదొడ్డి, అక్బర్పేట-భూంపల్లి, దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట మండల కేంద్రాలతోపాటు పలు గ్రామాల్లో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ఆయా మండలాల పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని రఘునందన్‌రావు దిష్టిబొమ్మలను దహనం చేశారు. నోరు విప్పితే పచ్చి అబద్ధాలు మాట్లాడుతారని, చేయని పనులను కూడా తానే చేశానని ఫేక్ వీడియోల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారని వారు రఘునందన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.