హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ కమిషన్ నివేదిక తెప్పించుకొని అమలు చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి టీ లింగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని డిక్కీ హౌస్లో డీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ.. పీఆర్సీ గడువు ముగిసి మూడేండ్లు కావస్తున్నదని గుర్తుచేశారు. వెంటనే పీఆర్సీ అమలయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి విధివిధానాలు ఖరారు కాకముందే ఉద్యోగుల వేతనాల నుంచి కోత విధించడం ఏంటీ..?
అని మండిపడ్డారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల పాత పెన్షన్ విధానం అమలుపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడంపై నిలదీశారు. ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు విడుదల చేయాలని, సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించి పర్యవేక్షక పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధ్యాపక జ్వాల సంపాదకుడు ఎం గంగాధర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు పీ శాంతన్, వీ రాజిరెడ్డి, టీ శ్రీశైలం, బీ రేణుక, చాప బాబు, ఎం శామ్యూల్, జే రామస్వామి, ఏ శ్రీనివాస్ రెడ్డి, బీ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.