DTC Kishan Naik : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్‌కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో ఆయనను బుధవారం తెల్లవారుజామున చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో.. ఏసీబీ అధికారులు మంగళవారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లి ఆర్ఆర్ నగర్ కాలనీలోని కిషన్ నాయక్ నివాసంతోపాటు ఆయన సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్, నిజామాబాద్, నారాయణఖేడ్లలో ఆయన బంధువులు, సన్నిహితుల నివాసాలతోపాటు మహబూబ్‌నగర్‌లోని జిల్లా రవాణాశాఖ కార్యాలయం సహా 12 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాలు ముగిసిన అనంతరం డీటీసీ కిషన్ నాయక్‌ను అధికారులు ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఏసీబీ గుర్తించింది.
దాంతో ఆయనను విచారించేందుకు కస్టడీ కోసం ఏసీబీ పిటిషన్ వేయబోతున్నట్లు సమాచారం. మంగళవారం నాటి సోదాల్లో బయటపడ్డ కిషన్ నాయక్ స్థిర, చర ఆస్తుల విలువ 400 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాడులు జరుగుతాయని ముందే గ్రహించిన కిషన్ నాయక్ తనవద్ద ఉన్న బంగారాన్ని ముందే ఇతర చోటుకు తరలించినట్లు గుర్తించారు. కిషన్ నాయక్ అవినీతి చిట్టా తవ్వుతున్న ఏసీబీ అధికారులు ఇవాళ ఆయన బ్యాంకు లాకర్‌ను తెరవనున్నట్లు సమాచారం.