హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ పోటీ పరీక్షలపై ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నట్టు టీ-శాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. టీశాట్ నిపుణ చానల్లో వివిధ సబ్జెక్టులపై ఈ నెల 18 నుంచి తొమ్మిది రోజులపాటు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యక్షప్రసారాలుంటాయని వెల్లడించారు. గణితం, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ తదితర సబ్జెక్టులపై ప్రసారమయ్యే లైవ్ ప్రోగ్రామ్స్ మరుసటి రోజు విద్య చానల్లో సాయంత్రం 6 గంటలకు పునః ప్రసారం అవుతాయని తెలిపారు. డీఎస్సీ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు ఫోన్‌కాల్ ద్వారా చర్చలో పాల్గొని, తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని వేణుగోపాల్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జూలైలో డీఎస్సీ నిర్వహించనున్న విషయం తెలిసిందే.