హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల నియామక పరీక్ష డీఎస్సీ దరఖాస్తుల గడువును విద్యాశాఖ ఈ నెల 28 వరకు పొడిగించింది. గత సెప్టెంబర్ 6న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగా, అదే నెల 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆన్లైన్ ఫీజు చెల్లింపు గడువు శుక్రవారం ముగియగా, దరఖాస్తుల సమర్పణ గడువు శనివారం ముగియనున్నది. చివరిరోజు కావడంతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనేందుకు పోటీపడ్డారు. దీంతో సర్వర్ డౌన్ వంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు విద్యాశాఖ అధికారులు ఈ నెల 28 వరకు ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.
జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షలు
వచ్చే ఏడాది జనవరి చివరివారం లేదా ఫిబ్రవరి మొదటివారంలో డీఎస్సీ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉండగా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 6, 7న గ్రూప్ -2 పరీక్ష నిర్వహించనున్నారు. దీంతో గ్రూప్ -2, డీఎస్సీ రెండింటికి హాజరయ్యే అభ్యర్థులకు కొంత సమయమివ్వాలన్న ఆలోచనతో పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. కాగా, ఈ సారి డీఎస్సీకి కాస్త ఆశాజనకంగానే దరఖాస్తులొచ్చాయి. శుక్రవారం వరకు 1,56,449 మంది అభ్యర్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లించగా, వీరిలో 1,50,202 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. మరో వారం గడువు ఉన్నందున దరఖాస్తులు మరింత పెరిగే అవకాశం ఉన్నది.