హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ-2003 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు పాత పెన్షన్ పథకానికి అర్హులేనని హైకోర్టు స్పష్టంచేసింది. వారందరికీ పాత పెన్షన్ పథకాన్నే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్సీ-2003 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన తమకు పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయకపోవడం నిబంధనలకు విరుద్ధమని పేరొంటూ పలువురు ఉపాధ్యాయులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ నగేశ్ భీమపాక మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్, అడ్వకేట్ బొబ్బిలి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. 2004 ఆగస్టు 31 వరకు అమల్లో ఉన్న పాత పెన్షన్ పథకాన్ని డీఎస్సీ-2003 నోటిఫికేషన్ కింద నియమితులైన ఉపాధ్యాయులకు అమలు చేయకపోవడం చట్టవిరుద్ధమని, వారికి 2004 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని అమలు చేయడం చెల్లద ని పేర్కొన్నారు.
2003 కంటే ముందు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ కోసం 2003లో జారీచేసిన నోటిఫికేషన్ కింద ఎంపి క ప్రక్రియ 2004 జూన్ నాటికి పూర్తయిందని, పాలనాపరమైన జాప్యం వల్ల వారికి 2005 నవంబర్‌లో నియామక పత్రాలు ఇవ్వడంతో కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని అమ లు చేశారని, దీంతో ఆ ఉపాధ్యాయులకు తీర ని అన్యాయం జరుగుతున్నదని వివరించారు. ఈ వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. పాలనాపరమైన కారణాల వల్ల ఆ నియామకాలు జాప్యమయ్యాయని గుర్తించారు. దీని వల్ల పిటిషనర్లు నష్టపోవడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. డీఎస్సీ-2003 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు పాత పెన్షన్ పథకానికి అర్హులేనని ప్రకటిస్తూ.. ఆ టీచర్లకు పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని తీర్పు చెప్పారు. దీంతో 2003 టీచర్లతోపాటు కానిస్టేబుల్, గ్రూప్-1, హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు పాత పింఛన్ వర్తిస్తుంది.
12వేలకు పైగా టీచర్లే..
పాత పింఛన్ పరిధిలోకి వచ్చే వారిలో 12వేల మంది టీచర్లే ఉండనున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ 2003 నవంబర్‌లో ఇచ్చారు. అయితే నియామక ప్రక్రియను పూర్తిచేసి, ఉద్యోగాలను మాత్రం 2004లో భర్తీచేశారు. 2004 నుంచి రాష్ట్రంలో సీపీఎస్ అమల్లోకి వచ్చింది. వాస్తవానికి నోటిఫికేషన్‌ను ప్రామాణికంగా తీసుకుని సీపీఎస్‌ను అమలుచేయా ల్సి ఉండగా, పోస్టింగ్ తేదీ ఆధారంగా సీపీఎస్‌ను అమలుచేశారు. దీంతో వీరంతా బలవంతంగా సీపీఎస్ పరిధిలోకి వచ్చారు. దీనికి ఇప్పుడు రాష్ర్టాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌పార్టీయే కారణం. అయితే 2003 డీఎస్సీ టీచర్లకు పాత పింఛన్ వర్తింపజేయాలని 20 ఏండ్లుగా టీచర్లు పోరాడుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో టీచర్లు హైకోర్టును ఆశ్రయించడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో 12వేల మంది టీచర్లకు ఉపశమనం కలగనున్నది.
ప్రయోజనాలు ఇవే..
ఇంతకాలం సీపీఎస్ పరిధిలో ఉన్న టీచర్లు తాజా తీర్పుతో పాత పింఛన్ విధానం పరిధిలోకి వస్తారు. దీంతో ఆయా టీచర్లకు పదవీ విరమణ తర్వాత సర్వీస్ పెన్షన్ దక్కుతుంది. డెడ్ కమ్ ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. గ్రాట్యుటీ కూడా అందుతుంది. కమ్యూటేషన్ (పెన్షన్‌ను ముందుగానే ప్రభుత్వానికి విక్రయించే) సౌకర్యమేర్పడుతుంది. రిటైర్ అయ్యాక ప్రతి పీఆర్సీ ఫిట్మెంట్, డీఏ పెంపుదలలో భరోసా దొరుకుతుంది.
చారిత్రాత్మక తీర్పు: దాముక కమలాకర్
డీఎస్సీ-2003 టీచర్లు, ఇతర ఉద్యోగులకు పాత పింఛన్ అమలుచేయాలన్న హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్ అభివర్ణించారు. కోర్టుతీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయాలని కోరారు.